తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భానుడు భగభగలాడుతున్నాడు. ఉదయం ఏడు, ఎనిమిది గంటలకు సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. ఆదివారం రోజున ఎండల తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరింది. రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాలు తీవ్రమైన వడగాల్పుల ప్రభావంతో అల్లాడిపోయాయి. ఐదు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల మార్కును దాటాయి. మరో 14 జిల్లాల్లో పారాలు 43 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇతర 11 జిల్లాల్లో 42 నుంచి 43 డిగ్రీల వేడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. కేవలం మూడు జిల్లాల్లో మాత్రమే 41 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
పట్టణ ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. రంగారెడ్డి జిల్లాలోని గండిపేటలో 43.1 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ గండిమైసమ్మలో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ ప్రాంతంలో 42.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డైంది. నగరవాసులు మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
తెలంగాణ అభివృద్ధి ప్రణాళికా సంఘం (TGDPS) వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు రాష్ట్రంలోనే అత్యంత వేడి ప్రాంతంగా నిలిచింది. ఇక్కడ గరిష్ఠంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీని తర్వాత కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 44.3 డిగ్రీలు రికార్డయ్యాయి. నిజామాబాద్ జిల్లా పోతంగల్‌లో 44.3 డిగ్రీలు ఉండగా నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో 44.2 డిగ్రీల వేడి నమోదైంది. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్‌లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలోని 14 జిల్లాల్లో 43 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా కాసిపేటలో 43.9 డిగ్రీలు నమోదు కాగా.. నల్గొండ జిల్లా గుడిపల్లిలో 43.8 డిగ్రీలు నమోదయ్యాయి. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరమెరిలో 43.7 డిగ్రీలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లా కోహెడలో 43.7 డిగ్రీలు రికార్డయ్యాయి. మెదక్ జిల్లా హవేలీఘనపూర్‌లో 43.6 డిగ్రీలు ఉండగా జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో 43.4 డిగ్రీల వేడి నమోదైంది.
మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ జిల్లాలో 43.4 డిగ్రీలు రికార్డయ్యాయి. నారాయణపేట జిల్లా ఉట్కూరులో 43.4 డిగ్రీలు ఉన్నాయి. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో 43.2 డిగ్రీలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో 43.1 డిగ్రీలు రికార్డవ్వగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో 43.1 డిగ్రీలు ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో 43.1 డిగ్రీలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కల్హేర్‌లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది.
42 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైన జిల్లాల జాబితా కూడా పెద్దగానే ఉందని అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా పెనుబల్లిలో 42.9 డిగ్రీలు రికార్డయ్యాయి. వికారాబాద్ జిల్లా కోటపల్లిలో 42.6 డిగ్రీలు ఉన్నాయి. వనపర్తి జిల్లా చిన్నంబావిలో 42.6 డిగ్రీల వేడి నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో 42.5 డిగ్రీలు రికార్డయ్యాయి. సూర్యాపేట జిల్లా చిల్కూరులో 42.4 డిగ్రీలు ఉండగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో 42.2 డిగ్రీలు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలో 42.2 డిగ్రీలు రికార్డయ్యాయి. హన్మకొండ జిల్లా ధర్మసాగర్‌లో 42.1 డిగ్రీలు ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది.
కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జనగామ జిల్లా కొడకండ్లలో 41.9 డిగ్రీల వేడి రికార్డైంది. మహబూబాబాద్ జిల్లా సీరోలులో 41.9 డిగ్రీలు నమోదయ్యాయి. వరంగల్ జిల్లా ఖానాపురంలో 41.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ALSO READ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 9195 కానిస్టేబుల్ ఉద్యోగాలకు.. నేటి నుంచే అప్లికేషన్ ప్రారంభం