Telangana MLC Eelections: తెలంగాణలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఈ నెల 10 వరకు కరీంనగర్ కలెక్టరేట్‌లో నామినేషన్ల స్వీకరిస్తారు. ఫిబ్రవరి 27న శాసనమండలి ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. మార్చి 3న శాసనమండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది.
రాష్ట్రంలో మరో ఎన్నకిల వేడి రాజుకుందా? ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ నడుస్తుండగా.. ఆ యా జిల్లాల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోటీకి పార్టీలన్నీ కసరత్తులు మొదలెట్టేశాయా? ఎవరెవరి టార్గెట్లు ఎలా ఉన్నాయ్? ఇప్పటికే ఆయా అభ్యర్ధులు మొదలు పెట్టిన ప్రచార క్రమమేంటి? హ్యావే లుక్..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతిచ్చే యోచనలో కాంగ్రెస్ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికల్లో పోటీకి ఆశావాహులు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు బలమైన అభ్యర్ధులను బరిలో నిలిపేందుకు.. గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు. బీజేపీ ఓ అడుగు ముందుకేసి.. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించి పోటీలో ముందు వరుసలో నిలిచింది.
పట్ట భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్దిగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువుకు చెందిన అంజిరెడ్డిని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పెద్ద పల్లి జిల్లా బంధం పల్లికి చెందిన మల్క కొమురయ్య తమ అభ్యర్దులుగా కాషాయ పార్టీ ప్రకటించింది. బీజేపీ తన అభ్యర్ధులను ప్రకటించి బరిలో దించడంతో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. ఈ నియోజకవర్గం పరిధిలో బీజేపీకి నలుగురు ఎంపీలు, ఏడుగులు ఎమ్మెల్యేలు ఉండటం తమకు కలిసొస్తుందని భావిస్తున్నారు. బీజేపీ అభ్యర్ధులు అప్పుడే ప్రచార పర్వానికి సైతం తెరలేపారు..
మరో పక్క రాష్ట్రంలో.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు ఎమ్మెల్సీ స్దానాలను తమ ఖాతాలో వేసుకునేందుకు హస్తం పార్టీ తహతహలాడుతోంది. బలమైన అభ్యర్దులను బరిలో నిలపాలని యోచిస్తోంది. గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి ఈ సారి పోటీ చేయనని ప్రకటించారు. తమ పేర్లు పరిశీలించాలని ఆశావాహులు అధిష్టానం చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు.
Also Read: తెలంగాణలో బీసీ జనాభానే ఎక్కువ.. కులగణన సర్వే వివరాలు వెల్లడించిన మంత్రులు..
కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యా సంస్దల ఛైర్మన్ నరేందర్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం రెండు నెలలు ముందే ప్రచారం మొదలు పెట్టారు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ప్లెక్సీలు హోర్డింగ్ లతో అభ్యర్దిగా ప్రచారం మొదలు పెట్టారు.
పోలీస్ శాఖలో ఉద్యోగాన్ని వదిలేసి పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో నిలిచేందుకు ఆర్మూర్ కు చెందిన మదనం గంగాధర్ నాలుగు జిల్లాల్లో తిరుగుతున్నారు. గ్రూప్-1 పేపర్ లీకేజీ నిందితులను పట్టుకునే విషయంలో గంగాధర్ క్రీయాశీలకంగా పనిచేశారు. అల్పోర్స్ అదినేత నరేందర్ రెడ్డి, మాజీ డీఎస్పీ గంగాధర్ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలను కలిసి పార్టీ అభ్యర్ధులుగా తమ పేర్లు పరిశీలన చేయాలని కోరుతున్నారు.
కరీంనగర్ జిల్లాకు చెందిన డాక్టర్ బీఎన్ రావు బీఆర్ఎస్ తరపున బరిలో దిగేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఉమ్మడి జిల్లాల్లో భారీ హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు. బీఆర్ ఎస్ అభ్యర్ధిగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆర్మూర్ కు బీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్ సైతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బీఆర్ఎస్ టికెట్టు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు..
త్వరలో ఖాళీ కానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలమైన అభ్యర్ధిని బరిలో నిలపాలని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్ర పక్షాలకు మద్దతు ఇవ్వాలని భావిస్తోంది కాంగ్రెస్. ఇదిలా ఉంటే.. బీజేపీ సైతం రెండు స్దానాలపై కన్నేసి సత్తా చాటాలని తీవ్ర కసరత్తులు చేస్తోంది. బీఆర్ఎస్ ఉనికి కాపాడుకునేందుకు బరిలో నిలిచి.. గట్టి పోటీ ఇవ్వాలనే ఆలోచనలో ఉంది.
ఇంతకీ పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు, ఉపాధ్యాయులు ఎవరికి అండగా నిలబడతారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్ధులుగా ఎవరు బరిలో ఉంటారన్నది త్వరలో తేలనుంది..