Income Tax Middle Class | దేశమంతా ఇప్పుడు బడ్జెట్‌లో పెంచిన ఆదాయపు పన్ను పరిమితి గురించే చర్చ జరుగుతోంది. భారతదేశంలో మధ్యతరగతి వారికి ఎంతో మేలు చేశామని, మధ్యతరగతి వారందరికీ ఊరటనిచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇందులో నిజమెంత? అని తెలుసుకునేందుకు ఒకసారి ఈ గణాంకాలు పరిశీలించాలి. వాస్తవానికి 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసినవారి సంఖ్య దాదాపు 8.09 కోట్లు. అందులో సుమారు 6 కోట్ల మంది రూ.7 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు. అంటే వీరంతా జీరో ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేశారు.
మిగిలిన వారిలో రూ.12 లక్షలకు మించిన వార్షిక ఆదాయం ఉన్నవారు కేవలం కోటి మంది మాత్రమే . అంటే మిగిలిన 1.09 కోట్ల మందికే కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల ఎక్కువ లాభం కలుగుతుందన్న మాట. ఎందుకంటే వారు మాత్రమే ప్రస్తుతం రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఆదాయం ఉండి పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నారు. అలాగే, స్లాబ్ మార్పుల వల్ల రూ.12 లక్షల నుంచి రూ.24 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి కూడా కొంత లాభం కలుగుతుంది.
కానీ, ఈ 1.09 కోట్ల మందికి లాభం కలిగించే నిర్ణయం తీసుకుని, మధ్యతరగతి వారందరికీ మేలు చేశామని చెప్పటం సరైనదేనా? అసలు పన్ను పరిధిలోకే రాని 138 కోట్ల మంది జనాభా గురించి ఏమిటి? వారి జీవనం ఎలా సాగుతోంది? అలాంటి వారందరినీ మధ్యతరగతిలోకి లేదా కనీసం ఆదాయపు పన్ను పరిధిలోకి తేవాలంటే, వారందరికీ తగిన ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఉండాలి కదా? కానీ ఈ బడ్జెట్‌లో ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించడం లేదు.
ఉద్యోగుల గురించి మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారు. వివిధ వేదికలపై వినిపించేది వారి స్వరమే. సమాజాన్ని ఎక్కువగా ప్రభావితం చేసేది కూడా వారే. అందుకే ప్రధానమంత్రి మోదీ వారినే లక్ష్యంగా చేసుకున్నారు. అందుకే ఇప్పుడు బడ్జెట్‌లో మిగతా విషయాలను పక్కన పెట్టి ఆదాయపు పన్ను గురించే దేశమంతా మాట్లాడుతోంది.
కేంద్రానికి రూ.లక్ష కోట్లు నష్టం!.. అంత ఎందుకు భరిస్తోందంటే
ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా చర్య వల్ల ఏడాదికి లక్ష కోట్ల రూపాయల నష్టం కలుగుతుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. సాధారణంగా ఇంతటి నష్టం కలిగించే చర్యలు ప్రభుత్వం తీసుకోదు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వ రుణాలు పెరిగిపోతున్నాయి. అలాంటి సమయంలో లక్ష కోట్ల ఆదాయాన్ని కోల్పోవడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఈ నష్టాన్ని ప్రభుత్వం భరిస్తోంది అంటే వేరే అసలు విషయం వేరే ఉంది. ప్రభుత్వ ఉద్దేశమే వేరు. తాత్కాలికంగా ఉద్యోగులను సంతృప్తి పరచడం ద్వారా తక్షణ ప్రయోజనాలు పొందడమే కాకుండా, పాత పన్ను విధానాన్ని పూర్తిగా తొలగించి, ప్రతి ఒక్కరినీ కొత్త పన్ను విధానంలోకి తీసుకురావడమే ప్రభుత్వం అసలు టార్గెట్. ఈ పరిమితి పెంపు ప్లాన్ కూడా దీనిలో భాగమే.
ప్రభుత్వం ఆదాయ పన్ను పెంచడంతో పాత పన్ను విధానం నిరర్థకమైపోతుంది. పన్ను కోసం చేసే సేవింగ్స్, అలవెన్సులు, పన్ను కోసం చేసే బీమా చెల్లింపులు వంటివన్నీ తెరమరుగైపోతాయి. మొత్తంగా అలవెన్సుల వ్యవస్థే కనిపించకుండా పోతుంది. దీనికితోడు మినహాయింపులు ఏవీ ఉండవు కాబట్టి, అత్యధిక శాతం మందికి పన్ను రిటర్నులు దాఖలు చేయడం చాలా సులభమైపోతుంది. రకరకాల ఆదాయాలు ఉండి, వాటిని మేనేజ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నవారికి తప్ప, ఒక్క జీతంపైనే ఆధారపడిన వారికి పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ట్యాక్స్ అసిస్టెంట్‌లు లేదా ఆడిటర్‌ల అవసరం ఉండదు.
ఇక ఆదాయపు పన్ను విభాగంలో కూడా రిఫండ్‌ల వంటి ప్రక్రియ ఉండదు. పన్నుల వ్యవస్థ సరళమైపోతుంది కాబట్టి, ఆదాయపు పన్ను విభాగాన్ని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. పైగా, సరళమైన పన్ను విధానం అమలులోకి వస్తుంది. రిబేట్ పరిమితి రూ.12 లక్షల వరకు ఉంటుంది కాబట్టి, వృత్తి నిపుణులతో సహా ఎక్కువ మంది రిటర్నులు దాఖలు చేయడానికి ముందుకు వస్తారు. ట్యాక్స్ బేస్ పెరుగుతుంది. భవిష్యత్తులో ఈ వారందరూ పన్ను చెల్లిస్తే, ఆదాయ వృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పాలి.