Polavaram Dispute: స్వేచ్ఛ బ్యూరో: ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య పోలవరం ప్రాజెక్టు వివాదం ముదురుతోంది. పోలవరం ఫేజ్-2 పనులపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫేజ్-2 పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ( పీపీఏ)కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ముంపు ప్రాంతాలపై పూర్తి స్థాయి సర్వే పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టవద్దని స్పష్టం చేసింది. ముఖ్యంగా భద్రాచలం సహా ప్రభావిత ప్రాంతాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.36 వాగుల డ్రైనేజ్ ప్రభావంపై అధ్యయనం చేయాలని తెలంగాణ డిమాండ్ చేసింది. పోలవరం లిఫ్ట్ స్కీమ్ పునఃప్రారంభంపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఏపీ పనులు చేస్తోందని ఆరోపించింది. పోలవరం లిఫ్ట్ స్కీమ్ వెంటనే ఆపాలని తెలంగాణ కోరింది. ఏపీ పనులను నియంత్రించాలని పీపీఏకి తెలంగాణ విజ్ఞప్తి చేసింది.
పోలవరం సాగునీటి ప్రాజెక్ట్ (పీఐపీ) ఫేజ్-II పనులను పునఃప్రారంభించాలనే ప్రతిపాదనలపై తెలంగాణ నీటిపారుదల శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ సీఈఓకుతెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ (జనరల్) రమేష్ బాబు లేఖ రాశారు. ఫేజ్-II పనులు మొదలుపెట్టే ముందు తెలంగాణ భూభాగంలో జరగాల్సిన ఉమ్మడి సర్వేను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 6, 2022 నాటి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు, సెంట్రల్ వాటర్ కమిషన్ ఛైర్మన్ ఆధ్వర్యంలో జరిగిన నాలుగు సాంకేతిక సమావేశాలలో తెలంగాణలో ఉమ్మడి సర్వే నిర్వహించాలని అంగీకరించారు. పోలవరం గరిష్ట నీటి మట్టం వద్ద తెలంగాణలో ముంపునకు గురయ్యే ప్రాంతాలు.నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం కిన్నెరసాని, ముర్రేడు వాగు నదుల వద్ద డ్రైనేజీ సమస్యల వల్ల ప్రభావితమయ్యే ప్రాంతాల గుర్తింపు.. గోదావరిలో కలిసే 6 నుంచి 7 ప్రధాన వాగుల వద్ద డ్రైనేజీ సమస్యలపై అధ్యయనం.. భద్రాచలం పట్టణం (కోవెల.. 8 అవుట్‌ఫాల్ రెగ్యులేటర్లతో సహా), మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ వద్ద నీటి మట్టాల పరిశీలన చేయాల్సి ఉంది.
పోలవరం ప్రాజెక్టును రెండో దశ పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టి పూర్తి స్థాయి నీటి మట్టం (45.72 మీటర్లు) వరకు నీటిని నిల్వ చేయాలని ప్రణాళికలు జరుగుతున్నట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ భూభాగంలో 954 ఎకరాల మేర జరిగే ముంపుపై జాయింట్ సర్వేను వెంటనే చేపట్టడం అత్యవసరమని తెలంగాణ ప్రభుత్వం కోరిందన్నారు. దీనిపై ఉమ్మడి సర్వే నిర్వహించకుండా పనులు ముందుకు తీసుకెళ్లడం సరికాదని లేఖలో పేర్కొన్నారు.తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాపాడేందుకు, ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ముందస్తుగా సర్వే నిర్వహించి, అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ ఈ లేఖతో డిమాండ్ చేశారు.
Also read: బండికి బీజేపీలో నేతలంతా శత్రువులే..! కార్యకర్తలే కొండంత అండ..! అమిత్ షా ఏం చేయబోతున్నారు??
రెండు దశల్లో చేపడుతున్నట్లు, మొదటి దశలో 41.15 మీటర్ల వరకు, రెండో దశలో 45.72 మీటర్ల వరకు నీటిని నిలువ చేస్తారని వివరించారు. ముంపు సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని గత సమావేశాల్లో నిర్ణయించినట్లు, ప్రస్తుతం 6 స్థానిక వాగులపై సర్వే జరుగుతోందని తెలిపారు. గోదావరి నదిలోకి కలిసే 36 స్థానిక వాగుల వద్ద నీటి నిల్వ కారణంగా ఏర్పడే ముంపు సమస్యల గురించి ఈ లేఖలో ప్రస్తావించారు. ‘గోదావరి జలాల వివాదాల ట్రిబ్యునల్’తీర్పు ప్రకారం, ప్రభావిత ప్రాంతాలను గుర్తించి, అవసరమైన రక్షణ చర్యలు చేపట్టే వరకు అక్కడ ఎలాంటి పనులు చేయకూడదని ,నీటిని నిల్వ చేయకూడదని స్పష్టం చేశారు. ఈ రక్షణ చర్యలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్, లేదా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనుమతి లేకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలిపివేసిన ‘పోలవరం లిఫ్ట్ స్కీమ్’ పనులను తిరిగి ప్రారంభించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలోనే (2021-22లో) ఈ పనులను ఆపాలని ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు.
పోలవరం ప్రాజెక్టును ఒక సమగ్రమైన ప్రాజెక్టుగా పరిగణించాలని, అందులో ఏదైనా ఒక మార్పు చేస్తే అది మిగిలిన అంశాలపై ప్రభావం చూపుతుందని కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి పేర్కొన్నట్లు లేఖలో వివరించారు. అందువల్ల, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పనులను వెంటనే నిలిపివేయాలని సూచించారు. ఏప్రిల్ 8, 2025న జరిగిన ప్రత్యేక సమావేశంలో, తెలంగాణ ప్రభుత్వం ఈ లిఫ్ట్ స్కీమ్ పనుల నిలిపివేత గురించి ప్రశ్నించగా, ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ ఆ పనులు ఇప్పటికే నిలిపివేసినట్లు తెలిపారని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ లిఫ్ట్ స్కీమ్ పనులతో ముందుకు వెళ్లకుండా కట్టడి చేయాలని, ఒకవేళ ఇప్పటికే పనులు చేసి ఉంటే వాటిని వెనక్కి తీసుకోవాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాలను సరిగ్గా అంచనా వేయడానికి సంయుక్త సర్వే నిర్వహించాలని, దానికి సంబంధించిన నివేదికలను క్రమం తప్పకుండా సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అయితే ఏపీ మాత్రం ప్రాజెక్టు నిర్మాణానికి అడుగులు వేస్తుంది. కేంద్రజలశక్తి మంత్రిని కలిసి ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని, నిధులు విడుదల చేయాలని, సముద్రంలో కలిసే నీటిని మాత్రమే వాడుకుంటామని పేర్కొంటుంది. ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశంకావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. 2027 గోదావరి పుష్కరాల లోపు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పూర్తి చేసేందుకు పూర్తి సహకారం అందించాలని చంద్రబాబుకోరారు. తొలిదశలో 41.15 మీటర్ల మేర నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన నిర్మాణాలను పూర్తి చేయాలని, ఇప్పటికే తాను స్వయంగా 5 మార్లు ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని సమీక్షించినట్టు వెల్లడించారు.
Also read: దేశవ్యాప్తంగా నీట్-2026 పరీక్ష రద్దు.. పేపర్ లీక్‌పై సీబీఐ విచారణ, త్వరలో కొత్త షెడ్యూల్
2026 ఏప్రిల్ 2 నాటికి కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తి అయ్యిందని, గ్యాప్ 1, గ్యాప్ 2 లలో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని వివరించారు.ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్‌లో ఉందన్న కారణంతో 2011లో ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్ ఉత్తర్వులను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిని కోరారు. దీని వల్ల పోలవరం ప్రాజెక్టు పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా చేపట్టేందుకు వీలవుతుందని స్ఫష్టం చేశారు. సాగునీటి అవసరాల దృష్ట్యా మొదట నిర్ణయించిన దానికంటే కుడి, ఎడమ కాలువల సామర్ధ్యాన్ని 17,500 క్యూసెక్కులకు పెంచినట్టు వివరించారు. ప్రాజెక్టు తదుపరి పనులకు సంబంధించి అవసరమైన నిధులను కూడా మంజూరు చేయాలని కోరారు.
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల దాహార్తిని తీర్చే పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని చంద్రబాబుకోరారు.గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోయే 200 టీఎంసీల వరద జలాలలను మళ్లించేలా పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపడుతున్నట్టు వెల్లడించారు. వంశధారపై నేరడి బ్యారేజ్ నిర్మాణానికి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ముందుకు వెళ్తామని, ఏపీ నీటి అవసరాలకు అనుగుణంగా 8 వేల క్యూసెక్కుల సామర్ధ్యంతో కుడివైపున హెడ్ స్లూయిస్ నిర్మాణం చేపడతామని, దీనికి అవసరమైన భూసేకరణ కోసం ఒడిశాను ఆదేశించాల్సిందిగా కేంద్రాన్ని కోరారు.
Also Read: సెంటిమెంట్ ని ఫాలో అవుతున్న ఎన్టీఆర్.. వర్క్ అవుట్ అవుతుందా?