Mahesh Kumar Goud: సచివాలయంలో మంగళవారం జరిగిన చిట్‌చాట్‌లో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు క్షేత్రస్థాయి యథార్థాలను గ్రహించకుండా ఇంకా అజ్ఞానంలోనే కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ భ్రమలు.. కేసీఆర్ అప్పుల పాలన
కేటీఆర్, హరీష్ రావులకు గ్రౌండ్ రియాలిటీ ఏంటో అస్సలు తెలియడం లేదని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కేసీఆర్‌ను పెద్ద మేధావి అని అనుకుంటామని, కానీ ఆయన ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని దుయ్యబట్టారు. ఎల్నినో ప్రభావం దేశమంతటా ఉంటే, హరీష్ రావు మాత్రం అవగాహన లేకుండా పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవు
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. ఆ పార్టీకి రాష్ట్రంలో కాలం చెల్లిపోయిందని, ఇప్పుడున్న 8 మంది ఎంపీల్లో ముగ్గురు గెలవడమే కష్టమని, ఉన్న 8 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా తిరిగి గెలిచే పరిస్థితి లేదని అన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో 40 శాతం సీట్లు కాంగ్రెస్‌కే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ లక్ష్యం.. నవంబర్‌లో పరిష్కారం
రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని, రాబోయే ఎన్నికల్లో 100 సీట్లు సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రజల్లో ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం పథకాల లబ్ధిదారులు, 90 వేల ఉద్యోగాలు పొందిన యువత కాంగ్రెస్‌కు అండగా ఉన్నారని పేర్కొన్నారు. నవంబర్ నాటికి అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ఆ తర్వాత తమ దృష్టి నేరుగా ఎన్నికలపైనే ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి తమకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, దేశంలో ఏ పార్టీలో లేనంత సహకారం, సమన్వయం తెలంగాణ కాంగ్రెస్‌లో ఉందన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ పార్టీయే శాశ్వతమని పునరుద్ఘాటించారు.
Also Read: ప్రేమ పేరుతో మోసం.. ఖమ్మంలో ప్రియుడి ఇంటి ముందు బాధితురాలి ధర్నా!