EX DCP Radhakishanrao Remand Extend: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు కష్టాలు తప్పలేదు. ఆయన రిమాండ్‌ను ఈనెల 12 వరకు పొడిగించింది న్యాయస్థానం. మంగళవారంతో ఆయన కస్టడీ ముగిసింది. ఆయనను ఏడురోజుల పాటు విచారించిన దర్యాప్తు టీమ్‌కు అనేక విషయాలు తెలిశాయి. అయితే ఆయన కస్టడీ ముగియడంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి వైద్య పరీక్షల కోసం గాంధీకి తరలించారు.
ఆసుపత్రి నుంచి నేరుగా నాంపల్లి కోర్టులో రాధాకిషన్‌రావును ప్రవేశపెట్టారు. విచారణ చేపట్టిన న్యాయ మూర్తి ఈనెల 12 వరకు ఆయనకు రిమాండ్ పొగించారు. విచారణ సమయంలో తనను జైలులో ఉన్న లైబ్రరీకి అనుమతించలేదని రాధాకిషన్‌రావు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. జైలు సూపరింటెండెంట్ ను కలవనీయడం లేదని తెలిపారు. దీనికి న్యాయస్థానం అనుమతి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు రిమాండ్ విధించిన అనంతరం ఆయన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
మరోవైపు రాధాకిషన్‌రావు కస్టడీని పొడిగించాలని పిటిషన్ వేయనున్నారు పంజాగుట్ట పోలీసులు. ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ కోసం ప్రత్యేక పీపీని నియమించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. నెలరోజులుగా ఈ కేసు విచారణ కొనసాగుతోంది. రాధాకిషన్‌రావుతోపాటు మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావులను అరెస్ట్ చేశారు. హై ప్రొఫైల్ కేసు కావడంతో ప్రత్యేక పీపీని నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.