Minority Colleges: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో మైనార్టీ విద్యార్థుల ఉన్నత విద్యను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ప్రతి జిల్లాలో రెండు మైనార్టీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని మైనార్టీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీటిలో ఒక కళాశాల బాలికలకు, మరొకటి బాలురకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలపై త్వరలోనే ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మైనార్టీ విద్యార్థుల విద్యా పరిస్థితులపై మైనార్టీ సంక్షేమ శాఖ ఇటీవల నిర్వహించిన సర్వేలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత గణనీయమైన సంఖ్యలో విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు, సమీపంలో డిగ్రీ కళాశాలలు లేకపోవడం, రవాణా, వసతి వంటి సమస్యలు ఇందుకు ప్రధాన కారణాలుగా సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది.
Also Read: రంగనాథ్‌ను హైడ్రా నుంచి తప్పించండి.. సీఎస్‌కు హైకోర్టు ఆదేశం!
ఈ నేపథ్యంలో మైనార్టీ విద్యార్థులకు జిల్లా స్థాయిలోనే నాణ్యమైన డిగ్రీ విద్య అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా బాలికల చదువుకు ఆటంకాలు ఎదురుకాకుండా వారికి ప్రత్యేక కళాశాలలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిసింది. బాలురు, బాలికలకు వేర్వేరుగా విద్యాసంస్థలు ఉండడం వల్ల చేరికలు పెరగడంతో పాటు డ్రాప్‌అవుట్‌లు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు అమలుకు సుమారు రూ.1,000 కోట్ల వ్యయంతో ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. కొత్త భవనాలు, ఆధునిక తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, అవసరమైన చోట హాస్టళ్లు వంటి మౌలిక సదుపాయాలను కల్పించేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. దశలవారీగా అన్ని జిల్లాల్లో ఈ కళాశాలలను ఏర్పాటు చేసే అవకాశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.
మైనార్టీ సంక్షేమ శాఖ తుది నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనుండగా, ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే కార్యాచరణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యపై పూర్తిస్థాయి ఫోకస్ పెట్టింది. విద్యారంగం బలోపేతం కోసం కీలక చర్యలు చేపడుతోంది. అంతేకాకుండా తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేజీబీవీల్లోనూ ఎక్సలెన్సీ కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు జేఈఈ, నీట్ వంటి కోచింగ్ పై శిక్షణను అందజేస్తోంది. కాగా మైనార్టీలకు కూడా ప్రత్యేకంగా డిగ్రీ కాలేజీలు ఏర్పాటు ప్రతిపాదన అమలైతే మైనార్టీ విద్యార్థులకు ఉన్నత విద్య మరింత చేరువ కావడంతో పాటు వారి విద్యా, ఉపాధి అవకాశాలు గణనీయంగా మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు.
Also Read: Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా డేటా లీక్.. హ్యాకర్ల చేతిలోకి ఆధార్, లోన్ వివరాలు..!