Drug Manufacturing: స్వేచ్ఛ బ్యూరో: దేశవ్యాప్తంగా సింథటిక్ డ్రగ్స్ అక్రమ తయారీకి వినియోగించే రసాయనాలపై ఉక్కుపాదం మోపాలని ఈగల్ ఫోర్స్ నిర్ణయించింది. ముఖ్యంగా ముడి సరుకుల రవాణాను కట్టడి చేసేందుకు తెలంగాణ ఈగల్ ఫోర్స్ కీలక చర్యలకు సిద్ధమైంది. ఈ క్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సోమవారం ఉన్నతస్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించింది. డ్రగ్స్ అక్రమ తయారీ, సరఫరా, రవాణాకు సహకరించే సంస్థలు, వ్యక్తులపై ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. గత నెల 22, 23 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగిన 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ అధిపతుల సమావేశంలో తెలంగాణ ఈగల్ ఫోర్స్‌కు దేశంలోనే అత్యుత్తమ ట్రోఫీ లభించినట్లు వెల్లడించారు.
నార్కోటిక్స్ కంట్రోల్ విజన్ డాక్యుమెంట్ ప్రారంభం..
సింథటిక్ డ్రగ్స్ అక్రమ తయారీని అరికట్టడంతో పాటు, మాదకద్రవ్యాల సంబంధిత నేరాల నియంత్రణలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా ఈ అవార్డును అందించినట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశంలోనే 2026–2029 నార్కోటిక్స్ కంట్రోల్ విజన్ డాక్యుమెంట్‌ను కూడా ప్రారంభించారు. 2029 డిసెంబర్ 31 నాటికి దేశంలో డ్రగ్స్ అక్రమ వ్యాపారాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఈ డాక్యుమెంట్‌ను రూపొందించారు. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో భాగంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఈగల్ ఫోర్స్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఈ ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈగల్ ఫోర్స్ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్య సమావేశానికి అధ్యక్షత వహించారు. సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలపై రూపొందించిన వ్యూహాత్మక కార్యాచరణను చర్చించారు.
డ్రగ్స్ అరికట్టడంపై ప్రత్యేక దృష్టి..
ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇంటెలిజెన్స్, ఆపరేషన్స్, ముడి రసాయనాలు, సింథటిక్ డ్రగ్స్ నియంత్రణ, డ్రగ్స్ వినియోగాన్ని తగ్గించడం, బాధితులకు సహాయక చర్యలందించటంతో పాటు అధికారులకు తగిన శిక్షణనిచ్చి, శాఖల మధ్య సమన్వయం పెంపొందించే అంశాలపై వ్యూహం సిద్దం చేశారు. వీటిలో ప్రధానంగా సింథటిక్ డ్రగ్స్ తయారీ, వాటికి ఉపయోగించే రసాయనాల అక్రమ మళ్లింపును అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. సింథటిక్ డ్రగ్స్ తయారీకి ఉపయోగించే కెమికల్ రియాక్టర్లను కొన్ని పరిశ్రమలు ఇతర వ్యక్తులు, సంస్థలకు అద్దెకు ఇస్తున్నట్లు విచారణలో గుర్తించారు. ఈ సమావేశంలో ఈగల్ ఫోర్స్‌తో పాటు టీజీ సేఫ్ డ్రగ్స్ విభాగం, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ఫ్యాక్టరీస్ శాఖ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ల అధికారులు, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ హెచ్- న్యూ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఈగల్ ఫోర్స్ ఆపరేషన్స్ ఎస్పీ పి. సీతారాం, టీజీ సేఫ్ డ్రగ్స్ విభాగం డైరెక్టర్ జి. రాంధన్, ఫ్యాక్టరీస్ వై. మోహన్ బాబు, జాయింట్ చీఫ్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ డి. నరేందర్, స్టేట్ టాస్క్ ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ రెడ్డి, ఎస్ ఓటీ డీసీపీ పి. శోభన్ కుమార్, మల్కాజ్ గిరి ఎస్ఓటీ అదనపు డీసీపీ షకీర్ హుస్సేన్, ఫ్యూచర్ సిటీ అదనపు డీసీపీ షేక్ జహంగీర్, యాధాద్రి భువనగిరి డీసీఆర్బీ డీఎస్పీ ప్రసాద్, సంగారెడ్డి డీసీఆర్బీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమలకు ప్రత్యేక హెచ్చరికలు
కెమికల్, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు స్వచ్ఛంద ప్రవర్తనా నియమావళి తప్పనిసరిగా పాటించాలని ఉన్నత స్థాయి సమావేశ సూచించింది. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడం, ముడి రసాయనాల అక్రమ మళ్లింపును అడ్డుకోవడం, అనుమానాస్పద కార్యకలాపాల సమాచారాన్ని అధికారులకు అందించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. ముడి రసాయనాల అక్రమ వినియోగానికి సంబంధించిన అనుమానాస్పద సంకేతాలను పరిశ్రమల యాజమాన్యాలు గుర్తించాలని ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో త్వరలోనే బొల్లారం, జిన్నారం, చర్లపల్లి, జీడిమెట్ల, పాశమైలారం, బాలానగర్, యాదాద్రి భువనగిరి, పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతాల్లోని కెమికల్, ఫార్మా పరిశ్రమల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఉన్నత స్థాయి సమావేశం నిర్ణయించింది.
కోళ్ల ఫారాలు, నిర్మానుష్య ఇళ్లలోనూ డ్రగ్స్ తయారీ
సింథటిక్ డ్రగ్స్ అక్రమ తయారీ కోసం కొందరు పౌల్ట్రీ ఫారాలు, నిర్మానుష్య ఇళ్లను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా నిషేధిత ఈ-సిగరెట్లను టీనేజర్లు, యువత, చిన్నపిల్లలకు విక్రయిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చిన విషయాన్ని ఉన్నత స్థాయి సమావేశం వెల్లడించింది. దీంతో ఇలాంటి కార్యకలాపాలపై నిఘా పెంచాలని, అక్రమ విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ఉన్నత స్థాయి సమావేశం నిర్ణయించింది. డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించి మరో కీలక విషయాన్ని ఈగల్ ఫోర్స్ గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రొపోఫోల్ అనే ఔషధాన్ని ఏసీ కంప్రెసర్ ఆయిల్‌గా తప్పుడు వివరాలు నమోదు చేసి తైవాన్‌కు పంపించిన ఘటనను గుర్తించింది.
అన్ని శాఖల డేటా అనుసంధానం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కెమికల్ యూనిట్లు, ల్యాబొరేటరీలు, పరిశోధన కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని వివిధ ప్రభుత్వ శాఖలు పరస్పరం పంచుకునేలా చర్యలు తీసుకోవాలని ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నిఘా వ్యవస్థను బలోపేతం చేయడం, అనుమానాస్పద కార్యకలాపాలను ముందుగానే గుర్తించడం, సింథటిక్ డ్రగ్స్ తయారీని అడ్డుకోవడం ప్రధాన లక్ష్యాలుగా సమావేశం నిర్ణయించింది. సింథటిక్ డ్రగ్స్ అక్రమ తయారీకి, ముడి రసాయనాల అక్రమ మళ్లింపునకు పాల్పడే వ్యక్తులు, సంస్థలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈగల్ ఫోర్స్ హెచ్చరించింది. డ్రగ్స్ రహిత తెలంగాణ సాధన కోసం అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిరంతర చర్యలు కొనసాగిస్తూ, అన్ని శాఖల డేటాను అనుసంధానం చేయాలని ఉన్నత స్థాయి సమావేశం నిర్ణయించింది.
Also Read: అర్హులకు నై.. అనర్హులకు సై! జేఎల్స్ క్రమబద్ధీకరణలో తీవ్ర అక్రమాలు?