Road Safety: స్వేచ్చ బ్యూరో: దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను నివారించటానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వం కార్యాచరణను షురూ చేసింది. ఇందులో భాగంగా దేశం మొత్తం మీద అత్యధికంగా యాక్సిడెంట్లు జరిగిన వంద జిల్లాలను గుర్తించింది. వీటిలో 7జిల్లాలు తెలంగాణలో ఉన్నాయి. ఆయా జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలను తగ్గించటానికి ప్రత్యేక చర్యలను త్వరలోనే అమలు చేయనున్నారు. వీటిపై డీజీపీ సీ.వీ.ఆనంద్ బుధవారం రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తితో కలిసి 7జిల్లాల కలెక్టర్లు, 4 పోలీస్ కమిషనరేట్ల కమిషనర్లు, సేవ్ ఫౌండేషన్ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ మీటింగ్ జరిపారు.
ప్రతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, మరణాలు, యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు, ప్రమాదాలకు దారితీస్తున్న కారణాలు, ఏ సమయంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్న అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మార్గదర్శక్ పోర్టల్ డ్యాష్ బోర్డులో నమోదు చేయాలని డీజీపీ సూచించారు. అందుబాటులో ఉన్న డేటాను విశ్లేషించడం ద్వారా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి వాటి నివారణకు తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో ఏటా సుమారు 1.75 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని డీజీపీ ఆనంద్ తెలిపారు. తెలంగాణలో ఏటా సుమారు 7 వేల మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల మరణాల్లో తెలంగాణ దేశంలో ఏడో స్థానంలో ఉందన్నారు. ప్రమాదాల నివారణకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ బ్యూరో ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దీనికి సంబంధించి త్వరలో జీవో వెలువడుతుందని వెల్లడించారు.
రాష్ట్రంలో రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించే లక్ష్యంతో తెలంగాణలోని ఏడు జిల్లాల్లో ప్రత్యేక జిల్లా రోడ్డు భద్రతా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించారు. సేఫ్‌లైఫ్ ఫౌండేషన్ రూపొందించిన ఈ ప్రణాళికల్లో 2024, 2025 eDAR గణాంకాల ఆధారంగా ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించారు. మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో 48 కీలక ప్రమాద కారిడార్లు, నాలుగు లేదా అంతకంటే ఎక్కువ మరణాలు నమోదైన 230 డేంజర్ స్పాట్లు, 220 ట్రాఫిక్ ఉల్లంఘన ప్రాంతాలు, 183 పాదచారుల ప్రమాద ప్రాంతాలను గుర్తించారు. ఇందులో సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 14 కీలక కారిడార్లు, రంగారెడ్డిలో 98 ప్రాధాన్య ప్రమాద ప్రాంతాలు, 99 ట్రాఫిక్ ఉల్లంఘన ప్రాంతాలు, 66 పాదచారుల ప్రమాద ప్రాంతాలు ఉన్నట్టు నిర్ధారించారు. ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదాల నివారణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను డీజీపీ ఆదేశించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రదేశాలు, సమయాలు, రహదారి నిర్మాణం, ఇంజినీరింగ్ లోపాలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.
Also read: తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు పై సీపీఐ(ఎం) ఉద్యమ బాట!
రోడ్డు ప్రమాదాల నివారణలో ‘4ఈ’ విధానాన్ని అమలు చేయనున్నట్టు డీజీపీ తెలిపారు. ఇందులో ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎమర్జెన్సీ సపోర్ట్ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు అత్యవసర వైద్యం అందేలా చర్యలు తీసుకోవడంతోపాటు ప్రమాదాలకు కారణమయ్యే రహదారి లోపాలను గుర్తించి సరిదిద్దాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ ఎలక్ట్రానిక్ డిజిటల్ యాక్సిడెంట్ రిపోర్ట్ (ఈ-డార్) నమోదు చేయాలని రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి అధికారులకు సూచించారు. మార్గదర్శక్ పోర్టల్ లో ప్రమాదాలు, గాయపడిన వారి వివరాలు తదితర సమాచారాన్ని నమోదు చేయాలని చెప్పారు. ప్రమాదాలు జరిగిన ప్రాంతాల జియో ట్యాగ్ ఫొటోలను కూడా మార్గదర్శక్ పోర్టల్ డ్యాష్ బోర్డులో అప్ లోడ్ చేసే అవకాశం ఉందని తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న రోడ్డు ప్రమాదాల నివారణ విధానాలను ఈ సందర్భంగా వివరించారు.
నవంబరు 3న చెన్నైలో జరగనున్న సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలు, రూపొందించిన కార్యాచరణ ప్రణాళికపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలు మరణాలు ఎక్కువగా ఉన్న ఏడు జిల్లాల్లో ప్రమాదాల నియంత్రణకు చేపట్టిన చర్యలు, భవిష్యత్ ప్రణాళికలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డీజీపీ ఆదేశించారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రమాదాల సంఖ్య, ముఖ్యంగా మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Also read: సీఈసీ నియామక వివాదంలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి దిగిన సీజేఐ బెంచ్!