Telangana New Record: వేసవికాలం రాకముందే అప్పుడే ఎండలు భగభగ మంటున్నారు. గడిచిన నాలుగు రోజులుగా పరిశీలిస్తే సాధారణ కంటే అధికంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాత్రి వేళ అప్పుడే ఉక్కుపోత మొదలైంది. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఒక్క గురువారం మెదక్‌లో అత్యధికంగా దాదాపు 36 డిగ్రీలు సెల్సియస్ నమోదు అయ్యింది. ఇది సాదారణ కంటే మూడున్నర డిగ్రీలు ఎక్కువన్నమాట.
భానుడి ప్రభావంతో విద్యుత్ వినియోగంపై పడింది. తెలంగాణ చరిత్రలో తొలిసారి అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు అయ్యింది. గురువారం రోజు రికార్డు స్థాయిలో 15,752 మెగావాట్లుగా నమోదు అయినట్టు ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్ వెల్లడించారు. గతేడాది మార్చి 8న 15,623 మెగావాట్లు నమోదు కాగా, ఇప్పుడు దాన్ని అధిగమించింది.
నార్మల్‌గా అయితే ప్రతీ ఏడాది మార్చిలో రోజువారీ గరిష్టంగా విద్యుత్ డిమాండ్ నమోదు కావడం చాన్నాళ్లుగా వస్తోంది. ఈసారి ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో కొత్త రికార్డు నమోదు అయ్యింది. ఈసారి రబీ పంటల సాగు విస్తీర్ణం పెరగడమే ప్రధాన కారణం. దీనికితోడు ఇళ్లు, పరిశ్రమల్లో విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈ లెక్కన రోజువారీ డిమాండ్ చూస్తుంటే మునుముందు పెరిగే అవకాశముందని విద్యుత్ అధికారుల అంచనా.
ఈ లెక్కన మార్చిలో 17 వేల మెగావాట్లుకు చేరవచ్చన్నది ఉన్నతాధికారుల మాట. పరిస్థితి గమనించిన విద్యుత్ సంస్థలు నిరంతర సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నాయి. 14 నెలల కాలంలో వ్యవసాయం, వ్యవసాయం ఆధారిత, పరిశ్రమలతో సహా వివిధ రంగాలకు విద్యుత్ సరఫరాను అందించడానికి ప్రభుత్వం గణనీయమైన చర్యలు చేపట్టింది.
ALSO READ: కేబినెట్లో వారికే చోటు.. క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం, ఏఐసీసీ పెద్దలతో మంతనాలు
గతంతో పోలిస్తే తెలంగాణ విద్యుత్ డిమాండ్ బాగా పెరిగింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం డిసెంబర్ 2024లో 13.49 శాతం కాగా, అంతకుముందు సంవత్సరం అదే నెలలతో పోలిస్తే 2025 జనవరిలో 10.10% పెరుగుదల నమోదు చేసింది. భవిష్యత్ విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి ప్రయత్నాలు చేపట్టింది.
విద్యుత్ వినియోగం పెరుగుతున్న దృష్ట్యా, తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు (SPDCL & NPDCL) ముందస్తుగా చర్యలు చేపట్టాయి. దీర్ఘకాలిక ఒప్పందాలు, పవర్ ఎక్స్ఛేంజీల నుండి విద్యుత్‌ను సేకరించాలని యోచిస్తోంది. వ్యూహాత్మక విద్యుత్ కొనుగోలు ద్వారా గత డిసెంబర్ నుండి జనవరి నెలల్లో తెలంగాణ ప్రభుత్వం ₹982.66 కోట్లను ఆదా చేసింది.
ఈ పొదుపులు లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా వినియోగం పెరిగి విద్యుత్ ఖర్చులను ఎదుర్కొనేవారు. రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్‌ను తీర్చడంలో తెలంగాణ సాధించిన విజయం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. విద్యుత్ కొనుగోలు ఆప్టిమైజేషన్, దీర్ఘకాలిక ఒప్పందాలు, సుస్థిర ఇంధన ప్రణాళికలపై వ్యూహాత్మక దృష్టితో, వినియోగదారులపై భారం పడకుండా భవిష్యత్ ఇంధన డిమాండ్లను తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.