Sci-Fi Thriller: భవిష్యత్తులో మనుషులతో పాటు కృత్రిమంగా తయారైన మనుషులు కూడా సమాజంలో సాధారణంగా జీవిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ? మనుషుల్లాగే కనిపించే రెప్లికెంట్స్ నిజంగానే పిల్లలను కనగలిగితే ? అలాంటి ఒక షాకింగ్ సీక్రెట్ విషయం బయట పడితే అది కేవలం ఓ కుటుంబ రహస్యంగానే మిగులుతుందా… లేక మొత్తం మానవ సమాజాన్నే మార్చేస్తుందా ? ఈ ప్రశ్న ల చుట్టూ సాగుతూ అద్భుతమైన విజువల్స్, యాక్షన్, మిస్టరీతో ఆకట్టుకునే సైన్స్ ఫిక్షన్ మూవీ ‘బ్లేడ్ రన్నర్ 2049’ (Blade Runner 2049). మరి ఈ సై-ఫై థ్రిల్లర్ తెలుగులో ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? ఏ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది ? అన్నది తెలుసుకుందాం.
2049లో లాస్ ఏంజిల్స్ లో మనుషులతో పాటు బయో – ఇంజనీర్డ్ కృత్రిమ మానవులు అయిన రెప్లికెంట్స్ కూడా జీవిస్తుంటారు. పాత తరం రెప్లికెంట్స్ తిరుగుబాట్లకు పాల్పడటంతో, వారిని గుర్తించి అంతం చేసే ప్రత్యేక పోలీస్ అధికారులను బ్లేడ్ రన్నర్స్ అంటారు. అలాంటి అధికారుల్లో ఒకడు ఆఫీసర్ కె. అతడూ ఓ రెప్లికెంటే అయినప్పటికీ తన విధులను కచ్చితంగా నిర్వర్తిస్తుంటాడు.
ఓ మిషన్ లో భాగంగా ఒక పొలంలో కెకు ఓ పాత పెట్టె కనిపిస్తుంది. అందులో ఓ మహిళా రెప్లికెంట్ అస్థిపంజరం బయట పడుతుంది. పరీక్షల్లో ఆమె సాధారణంగా మరణించలేదని, ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చనిపోయిందని తెలుస్తుంది. రెప్లికెంట్స్ సహజంగా పిల్లలను కనలేరనే నమ్మకాన్ని ఈ సీన్ బద్దలు కొడుతుంది. దీంతో ఈ విషయం బయటకు వస్తే మనుషులు, రెప్లికెంట్స్ మధ్య భారీ సంఘర్షణ జరిగే ప్రమాదం ఉందని లెఫ్టినెంట్ జోషి భయపడుతుంది. ఆ బిడ్డ ఆచూకీని కనిపెట్టి అంతం చేయాలని కెను ఆదేశిస్తుంది.
ఇదే సమయంలో రెప్లికెంట్లను తయారు చేసే బిలియనీర్ నియాండర్ వాలెస్ కూడా ఈ రహస్యంపై కన్నేస్తాడు. రెప్లికెంట్స్ సహజంగా సంతానం పొందగలిగితే తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించవచ్చని భావిస్తాడు. మరోవైపు ఆ బిడ్డ ఎవరనే అన్వేషణలో కెకు తన చిన్ననాటి జ్ఞాపకాలతో సంబంధం ఉందనే అనుమానం కలుగుతుంది. తానే ఆ బిడ్డనేమో అని భావించి, 30 ఏళ్లుగా కనిపించకుండా ఉన్న మాజీ బ్లేడ్ రన్నర్ రిక్ డెకార్డ్ ను వెతుకుతాడు.
చివరకు డెకార్డ్ ను కలిసిన కెకు అసలు నిజం తెలుస్తుంది. తాను ఆ బిడ్డ కాదు. డెకార్డ్, రాచెల్ లకు పుట్టిన ఆ అమ్మాయి అనా స్టెల్లిన్. రెప్లికెంట్లకు జ్ఞాపకాలను రూపొందించే వ్యక్తి కూడా ఆమెనే. కె తన జ్ఞాపకాల గురించి తెలుసుకున్నప్పటికీ, డెకార్డ్ ను వాలెస్ మనుషుల నుంచి కాపాడతాడు. తీవ్రంగా గాయపడిన కె. చివరికి డెకార్డ్ ను అతని కూతురి దగ్గరకు చేర్చిన తరువాత ఏం జరిగింది ? ఒక రెప్లికెంట్ అయినప్పటికీ, మరో రెప్లికెంట్ కోసం అతను చేసిన త్యాగం ఏంటి? షాకింగ్ క్లైమాక్స్ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.
‘బ్లేడ్ రన్నర్ 2049’ మూవీ ఇప్పుడు జియో హాట్‌స్టార్ (JioHotstar)లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ డబ్బింగ్ ఆడియోలు అందుబాటులో ఉన్నాయి. విజువల్ వండర్ తో పాటు మిస్టరీ, యాక్షన్, సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి ఇది మస్ట్ వాచ్ మూవీ. కాబట్టి అస్సలు మిస్ అవ్వొద్దు.
Read Also: వింత వైరస్ దాడితో సర్వనాశనమైన ప్రపంచం… తెలుగులోనే ఈ స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్