Telangana Student Suicide IIT Indore| తెలంగాణకు చెందిన ఒక బిటెక్ విద్యార్థి ఐఐటి ఇందోర్ క్యాంపస్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం డిసెంబర్ 3, 2025 రాత్రి కాలేజీ క్యాంపస్ లోని హాస్టల్ లో అతను ఉరి వేసుకొని ప్రాణాలు వదిలాడు. ఈ షాకింగ్ ఘటన గురించి హాస్టల్ యజమాన్యం పోలీసులకు సమాచారం అందించగా.. వారు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఫస్ట్ ఇయర్ బిటెక్ చదువుతున్న ఈ విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు.
వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన 17 ఏళ్ల కేథావత్ రోహిత్ కుమార్ మధ్యప్రదేశ్ లో ఐఐటి ఇందోర్ లో బిటెక్ చదువుకునేందుకు వెళ్లాడు. ఐఐటి లాంటి విద్యాసంస్థలో సీటు రావడంతో అక్కడ చదువుకొని తమ కొడుకు ప్రయోజకుడవుతాడని అతని తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. కొన్ని రోజుల క్రితమే రోహిత్ కుమార్ తన తల్లిదండ్రులను కలిసేందుకు వెళ్లాడు. అక్కడ అంతా బాగానే ఉంది. అయితే తిరిగి ఇందోర్ వచ్చిన తరువాత రోహిత్ కుమార్ ఏదో సమస్యలో ఉన్నట్లు అతని స్నేహితులు గమనించారు.
Also Read: పాత బట్టలు.. సెకండ్ హ్యాండ్ వాహనాలు.. పేదల్లా బతుకుతున్న ఈ కోటీశ్వరులు?
శుక్రవారం జనవరి 3 రాత్రి 8.30 గంటలకు రోహిత్ కుమార్ ఐఐటి ఇందోర్ విక్రం సారాభాయ్ హాస్టల్ లో తన గదిలో ఉరివేసుకొని చనిపోయాడు. అంతుకు కాసేపు ముందే హాస్టల్ మెస్ లో రాత్రి భోజనం కోసం అందరు విద్యార్థులు వెళ్లారు. ఈ క్రమంలో రోహిత్ కుమార్ రూమ్ మేట్స్, స్నేహితులు కూడా అతడిని తమతో భోజనానికి రావాలని పిలిచారు. కానీ అతను రాలేదు. భోజనం చేసిన తరువాత అతని స్నేహితులు తిరిగి వచ్చి చూస్తే.. హాస్టల్ గదిలో రోహిత్ కుమార్ తన మెడకు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. దీంతో వారంతా హాస్టల్ వార్డెన్ కు సమాచారం అందించారు. హాస్టల్ వార్డెన్ వెంటనే కాలేజీ యజమాన్యానికి, పోలీసులకు ఫోన్ చేసి విషయం తెలియజేశాడు.
హాస్టల్ సమీపంలోని సిమ్రోల్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ అమిత్ కుమార్ ఈ కేసులో విచారణ ప్రారంభించారు. రోహిత్ ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు అతడి స్నేహితులను ప్రశ్నించారు. రోహిత్ కుమార్ చాలా తెలివైన విద్యార్థి అని, అయితే అతను ఎక్కువగా ఫోన్ లో లాప్ టాప్ లో ఏదో ఒకటి చేసుకుంటూ బిజీగా ఉంటాడని వారంతా చెప్పారు. దీంతో పోలీసులు రోహిత్ కుమార్ కు చెందిన లాప్ టాప్, మొబైల్ ఫోన్ సీజ్ చేశారు.
రోహిత్ కుమార్ ఆత్మహత్యకు కారణం ఇదే..
ఆత్మహత్య చేసుకున్న బిటెక్ విద్యార్థి రోహిత్ కుమార్ వాట్సాప్ లో పోలీసులకు అతని మరణానికి గల కారణం తెలిసింది. రోహిత్ కుమార్ చనిపోయేముందు తన వాట్సాప్ స్టేటస్ లో తనకు ఉన్న వ్యసనం గురించి తెలియజేశాడు. తనకు ఆన్ లైన్ బెట్టింగ్ అలవాటు గత కొంత కాలంగా ఉందని.. దాని వల్ల భారీగా డబ్బులు పోగొట్టుకున్నానని రోహిత ఆ వాట్సాప్ స్టేటస్ లో రాశాడు. ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలిసి వారు క్షమించినా.. తాను ఆ బెట్టింగ్ గేమ్స్ కు అలవాటు పడిపోవడంతో మళ్లీ ప్రారంభించే అవకాశం ఉందని.. తనకు ఈ అలవాటు డ్రగ్స్ లాంటి వ్యసనంగా మారిపోయిందని వాట్సాప్ స్టేటస్ లో రాశాడు. అందుకే తనను ప్రేమించే వాళ్లందరికీ గుడ్ బాయ్ మరు జన్మలో నైనా ఈ దురవలాటు లేకుండానే జన్మిస్తానని రాసిపెట్టి ఉరివేసుకున్నాడు.
రోహిత్ చనిపోయాడని తెలిసి అతని తల్లిదండ్రులు శనివారం జనవరి 4న ఇందోర్ చేరుకున్నారు. పోలీసులు ప్రస్తుతం వాట్సాప్ లో రోహిత్ కుమార్ స్టేటస్ లో తెలిసిన విషయాలపై విచారణ చేస్తున్నారు.