Telangana : కేబినెట్ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్‌లో కాక రేపుతోంది. మంత్రి పదవులపై లుకలుకలు మొదలయ్యాయి. మాకంటే మాకంటూ కేబినెట్ బెర్త్ కోసం కర్చీఫ్ వేస్తున్నారు ప్రముఖులంతా. ఉగాదికే జాబితా వస్తుందనుకుంటే.. అది కాస్తా ఆలస్యం అవుతుండటంతో రచ్చ రాజుకుంటోంది. ఆ ఉక్కబోత భరించలేక ఆశావహులు ఒక్కొక్కరిగా నోరు జారుతున్నారు. బహిరంగంగానే బయటపడుతున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. మాజీ మంత్రి జానారెడ్డిని టార్గెట్ చేయగా.. లేటెస్ట్‌గా ప్రేమ్ సాగర్ రావు.. ఓ కుటుంబాన్ని కార్నర్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్‌లో కలకలం రేపారు.
ప్రేమ్ సాగర్ టార్గెట్ ఎవరు?
మంత్రి పదవిని అడ్డుకుంటూ.. తన గొంతు కోసేందుకు ఓ కుటుంబం ప్రయత్నిస్తోందంటూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. గొంతు కోస్తే ఊరుకోబోనని.. కుటిల యత్నాలను తిప్పికొడతానని హెచ్చరించారు. పార్టీని కష్టకాలంలో కాపాడిన వారికి అవకాశాలు కల్పించాలని.. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేయవద్దన్నారు. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వారు మంత్రి పదవి అడుగుతున్నారంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. ప్రేమ్ సాగర్ రావు టార్గెట్ చేసింది ఎవరిననే చర్చ జరుగుతోంది తెలంగాణలో.
రావు గారి మాటలకు అర్థాలే వేరులే!
రాజగోపాల్‌రెడ్డి గురించే ప్రేమ్‌సాగర్ అలా అన్నారని కొందరు అంటున్నా.. అది కరెక్ట్ కాదని తెలుస్తోంది. ఆయన మాట్లాడింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల గురించేనని చెబుతున్నారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామినే తన మంత్రి పదవికి చెక్ పెడుతున్నారనేది ప్రేమ్ సాగర్ వ్యాఖ్యల అంతరార్ధం అంటున్నారు. వివేక్‌తో పాటు కుటుంబంలో ఆయన సోదరుడు వినోద్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. కొడుకు వంశీ.. ఎంపీగా కొనసాగుతున్నారు. వివేక్ గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత బీజేపీకి మారారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. అందుకే ఆయన్ను టార్గెట్ చేస్తూ.. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వారు మంత్రి పదవి అడుగుతున్నారంటూ కామెంట్స్ చేశారు. ఉమ్మడి జిల్లా కోటాలో కేబినెట్ రేసులో ప్రేమ్ సాగర్‌కు వివేక్ నుంచి పోటీ ఉంది. ఆ ఫ్యామిలీ గుత్తాధిపత్యం కోసమే.. తన కేబినెట్ బెర్త్ కన్ఫామ్ కాకుండా అడ్డుకుంటున్నారనేది ప్రేమ్ సాగర్ రావు అక్కసుగా తెలుస్తోంది.
ఆలస్యం చేస్తే ఇట్టానే ఉంటాదా?
పెద్దలు జానారెడ్డిని రాజగోపాల్‌రెడ్డి టార్గెట్ చేసిన మరుసటి రోజే ప్రేమ్ సాగర్ రావు సైతం బహిరంగ ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీలో కాస్త కుదుపు వచ్చినట్టైంది. కేబినెట్ విస్తరణ లేట్ అవుతున్నా కొద్దీ.. ఇలాంటి పరిస్థితులే తలెత్తుతాయని.. అందుకే వీలైనంత తొందరగా ఆ పని పూర్తి చేయాలని అధిష్టానానికి మెసేజ్‌లు వెళ్తున్నాయట. నల్గొండలో రాజగోపాల్‌రెడ్డి బలమైన నాయకుడు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ్ సాగర్ రావు తిరుగులేని నేత. వారికి మంత్రి పదవులు ఇవ్వడంపై పార్టీ పెద్దలెవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. జానారెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఈయన్ను అడ్డుకోవడం అనేది టీ కప్పులో తుఫాను లాంటి వివాదమే తప్ప అంత పెద్దగా చూడాల్సిన అవసరం లేదని అంటున్నారు.
Also Read : అఘోరీ మొదటి భార్య ఎంట్రీ.. వర్షిణి పరిస్థితేంటి?
ఇద్దరేనా? ఇంకా ఉన్నారా?
ఆదిలాబాద్‌లో మాత్రం ప్రాబ్లమ్ కాస్త సీరియస్ గానే ఉన్నట్టుంది. ప్రేమ్ సాగర్ రావు ప్రస్తుతం ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన్ను సంతృప్తి పరచాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. ఏదైనా అసంతృప్తి ఉంటే పార్టీ అంతర్గత వేదికల్లో పంచుకోవాలి కానీ.. ఇలా బహిరంగా మాట్లాడి.. అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేయడం కరెక్ట్ కాకపోవచ్చని చెబుతున్నారు. ఇప్పటికైతే ఇద్దరు. మరో రెబల్ వాయిస్ వినిపించకూడదంటే.. సాధ్యమైనంత త్వరగా ఆ కేబినెట్ విస్తరణ అనేది ఏదైతో ఉందో.. దాన్ని కంప్లీట్ చేస్తే సరి. లేదంటే… ఇలానే ఉంటుంది మరి.