CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. 3 రోజులుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి సీఎం మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పునకు తుది రూపం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్‌తో నిన్న రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించారు. సోమవారం కూడా కేసి వేణుగోపాల్‌తో భేటీ కానున్నారు.
మంత్రివర్గంలో, పీసీసీ కార్యవర్గంలో చోటు దక్కించుకోవాలనుకునే వారి ఉత్కంఠకు ఇవాళ తెరపడే అవకాశం కనిపనిస్తోంది. మంత్రి వర్గంలో చోటు దక్కించుకునే అవకాశం ఉందని ఇప్పటికే పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సుదర్శన్ రెడ్డి, ఆది శ్రీనివాస్, శ్రీహరి ముదిరాజ్, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వెంకటస్వామితో పాటు మరికొంతమంది పోటీలో ఉన్నారు. ఈసారి తనకు కూడా అవకాశం కల్పించాలని మల్ రెడ్డి రంగారెడ్డి ఇప్పటికే అధిష్టానం పెద్దలను కలిసి కోరారు.
ఇక పీసీసీ కార్యవర్గం విషయానికి వస్తే కాంగ్రెస్ అధిష్టానం సామాజిక సమీకరణలకు పెద్దపీట వేయనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 70 శాతం వరకు అవకాశం కల్పించనుంది. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్‌లు, పెద్ద సంఖ్యలో జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్‌ల జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌లుగా రోహిన్ రెడ్డి, సంపత్ కుమార్ బలరాం నాయక్ పేర్లు దాదాపు ఖరారు అయ్యాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మైనార్టీల జాబితాలో ఫయూమ్ లేదా ఫిరోజ్ ఖాన్‌కు ఇచ్చే అవకాశం దక్కనుంది.
కాగా ఈ నెల 26న ఢిల్లీలో కాంగ్రెస్ బీసీ నేతల కీలక సమావేశం జరగనుంది. సమావేశానికి హాజరుకావాలని తెలంగాణ బీసీ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బీసీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ చైర్మన్‌లు తప్పకుండా సమావేశానికి హాజరుకావాలన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, ఇంచార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్‌లు పాల్గొననున్నారు. న్యూ ఢిల్లీలోని ఇండియా ఇంటర్ నేషనల్ సెంటర్‌లో సమావేశం జరగనుంది.
Also Read: ఫామ్‌హౌస్‌లో రెండుగంటలపాటు చర్చ.. కేటీఆర్‌కు ఆదేశాలు, కవిత విషయం నేను చూస్తా..?
గత కొద్దిరోజుల క్రితం సీఎం హోదాలో తొలిసారి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగే ఈ సదస్సుకి పలు అజెండాలతో ఆయన వెళ్లారు. 2047 నాటికి సాధించాలనుకున్న లక్ష్యాలు, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై ప్రత్యేక నివేదికను సమర్పించనున్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లు, కుల గణన వంటి కీలక అంశాలను నీతి ఆయోగ్ గవర్నెన్స్ సమావేశంలో ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి.