TG New Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఏ పథకం వర్తించాలన్నా.. రేషన్ కార్డు తప్పనిసరి. అంతటి ప్రాధాన్యత గల రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సోమవారం సంబంధిత అధికారులతో సమావేశమైన సీఎం కీలక ఆదేశాలిచ్చారు. సీఎం ఇచ్చిన ఆదేశాలతో రేషన్ కార్డుల మంజూరుపై ఉన్న అపోహలకు ఫుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు. ఇంతకు సీఎం ఇచ్చిన ప్రకటన ఏమిటో తెలుసుకుందాం.
ఏదైనా పథకం వర్తించాలన్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లబ్ది పొందలన్నా రేషన్ కార్డు ప్రామాణికం. అంతేకాదు ప్రతినెలా ప్రభుత్వం అందజేసే రేషన్ అందుకోవాలన్నా రేషన్ కార్డు ఉండాల్సిందే. సామాన్య కుటుంబాలకు రేషమ కార్డు ఒక భరోసా అనే చెప్పవచ్చు. ఇంతటి ప్రాధాన్యత గల రేషన్ కార్డు లేకుండా ఎన్నో కుటుంబాలు ప్రభుత్వ ప్రకటన కోసం మొన్నటి వరకు ఎదురుచూశాయి. ఎట్టకేలకు సీఎం రేవంత్ సర్కార్ నూతన రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే అధికారులు అర్హుల జాబితాను కూడా సిద్దం చేశారు.
ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించిన అధికారులు, ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే నూతన రేషన్ కార్డులు అందించేందుకు సిద్దమయ్యారు. కాగా ఇటీవల రెవిన్యూ అధికారుల చుట్టూ దరఖాస్తుదారులు ప్రదక్షిణలు చేస్తుండగా, వాటిని అరికట్టేందుకు మీసేవా కేంద్రాల ద్వారా సైతం ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. అంతేకాదు పాత రేషన్ కార్డులలో మార్పులు, చేర్పులకు సైతం ప్రభుత్వం అనుమతినిచ్చింది. రాష్ట్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రేషన్ కార్డు లేదనే ఒక్క కారణంతో పథకాల లబ్దికి దూరమవుతూ వచ్చారు. ప్రభుత్వం రేషన్ కార్డుల జారీకి పచ్చజెండా ఊపడంతో అర్హులందరూ కోటి ఆశలతో దరఖాస్తులు సమర్పించారు. ఇంతలోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాగా, కార్డుల జారీపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలాంటి సమయంలోనే రేషన్ కార్డుల జారీపై దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి.. సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రేషన్ కార్డుల పంపిణీలో పారదర్శకత పాటించాలని, అర్హులకు తప్పక కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అలాగే కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. ఇప్పటికే దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్లీ మళ్లీ దరఖాస్తు చేయకుండా అవగాహన కల్పించాలని అధికారులకు సీఎం సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో వెంటనే కార్డులు జారీకి చర్యలు తీసుకోవాలని కూడా సీఎం ఆదేశించారు. అలాగే కొత్త కార్డుల జారీకి సంబంధించి పలు డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.
Also Read: సిద్దిపేటపై కవిత ఫోకస్? పెద్ద ప్లానే!
సీఎం ఇచ్చిన ప్రకటనతో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాలలో త్వరలో నూతన రేషన్ కార్డుల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. కోడ్ ముగిసిన అనంతరం నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలలో పంపిణీ చేస్తారు. మొత్తం మీద తెలంగాణ ప్రజలకు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నూతన రేషన్ కార్డుల జారీపై ఉన్న అనుమానాలకు సీఎం ప్రకటన చెక్ పెట్టినట్లుగా చెప్పవచ్చు. కొత్త కార్డుల డిజైన్ పూర్తి కాగానే, అధికారులు అర్హులకు కార్డులను అందించనున్నారు.
కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసిన సీఎం
ఇప్పటికే దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్లీ దరఖాస్తులు చేయకుండా అవగాహన కల్పించాలన్న ముఖ్యమంత్రి
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్… pic.twitter.com/Nbb84oEmJh
— BIG TV Breaking News (@bigtvtelugu) February 17, 2025