TG Govt : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజులుగా ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతలను దృష్టిలో ఉంచుకుని.. వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా విలేజ్ కోసం సేకరించేందుకు విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్ ను ఉపసంహరించుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భావించారు. ఇందు కోసం ఈ ఏడాది ఆగష్టు 01 వ తారీఖున లగచర్లలో భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు.
లగచర్ల గ్రామంలోని 580 మంది రైతులకు సంబంధించిన 632 ఎకరాల భూముల్ని సేకరించాలని ప్రతిపాదించిన ప్రభుత్వం అక్కడ ఫార్మా విలేజ్ ని నిర్మించాలని భావించింది. దీంతో.. గ్రామంలోని ప్రజలు, రైతుల అభిప్రాయాలు సేకరించేందుకు జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు వెళ్లగా.. అక్కడ ఆందోళనలు మించిపోయి, ఏకంగా ప్రభుత్వ అధికారులపై దాడులకు దారితీసింది. ఇందులోని రాజకీయ కుట్రలపై ఇప్పటికే.. దర్యాప్తు చేస్తున్నారు.
ఆయా ప్రాంతాల్లోని ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. రేవంత్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని.. తమ పాలనలో ఎవరినీ ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదని తెలిపింది. కొందరు రైతులు సానుకూలంగా ఉన్నా, మరికొందరికి కొన్ని అనుమానాలు ఉన్నా.. అన్నింటినీ నివృత్తి చేస్తామని ప్రకటించింది. కానీ.. ఈ వ్యవహారాల్లో రాజకీయ కుట్రలు సైతం సాగుతుండడంతో.. శాంతిభద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా.. ఈ అంశాలను అడ్డం పెట్టుకుని రైతుల్లో వ్యతిరేకతను రేకెత్తించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
అయితే.. ఈ ప్రాంతంలో పరిశ్రమలను ఏర్పాటు చేసి గ్రామస్తులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తున్న రేవంత్ రెడ్డ ప్రభుత్వం మరో ఆలోచన చేస్తోంది. ఈ గ్రామాల్లో ఫార్మా సంస్థల ఏర్పాటును మాత్రమే వ్యతిరేకిస్తున్నారని. వాటి వల్ల కాలుష్యం వస్తుందన్న కారణంగా.. గ్రామస్తులు, రైతులు అంగీకరించడం లేదని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే.. ఫార్మా విలేజ్ ను పక్కన పెట్టి.. ఆ ప్రాంతంలో మరో రకమైన పరిశ్రమలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అందుకే.. మరికొన్ని రోజుల్లో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూసేకరణ చేపట్టేందుకు మరో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Also Read : కేటీఆర్ నువ్వు జైలుకే.. తొందరెందుకు వెయిట్ అండ్ సీ.. మంత్రి సురేఖ కామెంట్స్
వేరే పరిశ్రమల వల్ల కాలుష్యం ఉండదని పైగా యువతకు పెద్ద ఎత్తువ ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు. ముఖ్యంగా.. ఇక్కడి నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు.. టెక్స్ టైల్ పరిశ్రమలను నెలకొల్పాలని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.