Konda Surekha: కేటీఆర్ మాట్లాడితే జైలుకు పోతా అంటున్నావు.. తప్పు చేసిన వారు తప్పక జైలుకు పోవాల్సిందే.. మీ పాలనలో అంతా నాశనమేనంటూ తెలంగాణ మంత్రి కొండా సురేఖ సీరియస్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ లోని తన ఛాంబర్ లో శుక్రవారం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎందరో విద్యార్థులు మృతి చెందినా, ఏనాడు వారి కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలేదన్నారు.
ఇటీవల రైలు ప్రమాదంలో విద్యార్థులు మరణిస్తే, మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ లు ఒక్క కన్నీటి చుక్కైనా కార్చారా అంటూ మంత్రి కొండా సురేఖ విమర్శించారు. కవిత జైలు నుండి బయటకు వచ్చిన సమయం నుండి కేటీఆర్ కు టెన్షన్ పట్టుకుందని, కేటీఆర్ మానసిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తాను భావిస్తున్నానన్నారు. చెల్లెలిని చూసి కేటీఆర్ భయపడుతున్నట్లు ప్రచారం సాగుతుందని, అసలు రహస్యం బీఆర్ఎస్ నేతలకే ఎరుక అన్నారు.
ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్ర ఉన్నట్లు, ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఆ కుట్ర బయటకు వెళ్లడయ్యే అవకాశాలు ఉన్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు. గిరిజనుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేనేలేదని, అబద్ధపు మాటలతో, నాటకాలు ఆడుతూ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు బీఆర్ఎస్ సర్వశక్తుల కృషి చేస్తుందన్నారు.
సంక్షేమ హాస్టల్స్ ను తమ పాలనలో పట్టించుకోని కేసీఆర్, కేటీఆర్ లు, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లను ఏర్పాటు చేస్తుంటే ఓర్వలేక కుట్రలు పన్నుతున్నారన్నారు. కేటీఆర్ మాట్లాడితే జైలుకు పోతానంటున్నారని, చేసిన తప్పులకు కేటీఆర్ తప్పక జైలుకు పోవాల్సిందేనంటూ మంత్రి సీరియస్ కామెంట్ చేశారు.
కేటీఆర్ ను సైకోరావుగా సంభోధించిన మంత్రి, సైకోలా కేటీఆర్ ప్రభుత్వం పైన అవసర ఆరోపణలు చేస్తున్నారని, 10 సంవత్సరాల్లో ఏ గురుకులాల్లోకి వెళ్లి చూసిన పాపాన కేటీఆర్ పోలేదన్నారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ అంశంపై రాజకీయ దుర్దేశంతో బీఆర్ఎస్ మాట్లాడుతుందన్నారు. శైలజ మరణించడం తనకు చాలా బాధాకరంగా ఉందని, బాధతో నే ప్రెస్ మీట్ పెడ్తున్నట్లు కొంత ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో చాలా సంఘనటలు జరిగినా వారు పట్టించుకోలేదన్నారు. మూసీ,ఫార్మా విషయంలో కూడా గిరిజనులను అడ్డుపెట్టుకొని కావాలనే కలెక్టర్ ను చంపడానికి ప్లాన్ చేసారని మంత్రి విమర్శించారు. లా అండ్ ఆర్డర్ ప్రోబ్లం క్రియేట్ చేసి పెట్టుబడులు రాకుండా చేసేందుకు చూస్తున్నారని, ఇక్కడ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారన్న విషయాన్ని మరచిపోకు కేటీఆర్ అంటూ మంత్రి హెచ్చరించారు.
ఇక వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి మంత్రి మాట్లాడుతూ.. వరంగల్ ప్రజల మద్దతుతో అందరినీ ఒప్పించి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూసేకరణ పూర్తి చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఓ వైపు మీరు చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ, మరోవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా అబద్దపు ప్రచారాలు సాగిస్తుందని మంత్రి దుయ్యబట్టారు.