TG Municipal Elections: తెలంగాణలో మరోసారి ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలోని 10 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు పురపాలక శాఖ ఇటీవల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రిజర్వేషన్ల ప్రక్రియ నిబంధనలు, మార్గదర్శకాలను ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇవాళ ఏ స్థానాలు ఏ వర్గాలకు కేటాయిస్తారనేది దానిపై స్పష్టత రానుంది. అలాగే ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్, పోలీస్ శాఖల అభిప్రాయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఇవాళ గ్రేటర్ హైదరాబాద్, వార్డులు ఏ వర్గాలకు రిజర్వ్ చేయాలో తుది ప్రకటన చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం 75 గుర్తులను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. వీటిని ఎన్నికల కమిషన్ శుక్రవారం విడుదల చేసింది. రాష్ట్రంలో బల్దియా సహా 10 మున్సిపల్ కార్పొరేషన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి, బీసీలకు మూడు కార్పొరేషన్లు కేటాయించారు. ఇందులో రెండు జనరల్, ఒకటి మహిళలకు రిజర్వ్ చేశారు. ఐదు కార్పొరేషన్లను ఓసీ విభాగంలో ఉంచారు. ఇందులో నాలుగు నగరాలను మహిళలకు కేటాయించారు.
రాష్ట్రంలోని మొత్తం 121 మున్సిపాలిటీలలో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 స్థానాలు రిజర్వ్ చేశారు. మిగిలిన 61 స్థానాల్లో 31 మహిళలకు, 30 జనరల్ కేటగిరీలకు కేటాయించారు. సుప్రీంకోర్టు తీర్పుల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొత్తం రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి మించకుండా జాగ్రత్త తీసుకుంది ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ విభాగాల్లో 50 శాతం సీట్లను మహిళలకు కేటాయించింది. అయితే కలెక్టర్లు వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంది. ఈ రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత తుది నోటిఫికేషన్‌ను విడుదల అవుతుంది.
Also Read: Municipal Elections 2026: మోగనున్న మున్సిపల్ ఎన్నికల నగారా.. ఓటర్ల లెక్క తేలింది.. మహిళలదే పైచేయి..!
మున్సిపల్ రిజర్వేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం 2024 కులగణన సర్వే లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంది. వార్డుల రిజర్వేషన్ ను కూడా ఈ విధంగానే రిజర్వ్ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వారి జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయిస్తారు. జనాభా నిష్పత్తి తక్కువగా ఉండి ఒక్క సీటు కూడా రాకపోతే.. ఒక వార్డును వారికి కేటాయించేలా నిబంధన పెట్టారు. బీసీ రిజర్వేషన్లను కమిషన్ సిఫార్సుల మేరకు నిర్ణయిస్తారు. మహిళా రిజర్వేషన్లకు రాజకీయ పార్టీల నేతల సమక్షంలో కలెక్టర్లు డ్రా తీస్తారు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత తుది నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈసారి ఒకేసారి మున్సిపల్ ఎన్నికల నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించిన విషయం తెలిసిందే.