Electric Buses : రోజురోజుకు పెరిగిపోతున్న హైదరాబాద్ నగర జనాభాతో ప్రజారవాణాను మరింత మెరుగుపరుస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా.. పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్ని ప్రవేశ పెట్టనుండగా.. అన్నీ ఎలక్ట్రికల్ బస్సులే కానుండడం విశేషం. నగరంలో పెరుగుతున్న జనాభాతో పాటే కాలుష్యం భారీగా పెరిగిపోతుంది. పైగా.. ట్రాఫిక్ కారణంగా రోడ్డుపైకి వెళ్లాలంటే పొగ పీలుస్తున్నట్లే ఉంటుంది. ఈ సమస్యలన్నింటికి చెక్ పెడుతూ.. ఈ బస్సులతో నగరాన్ని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
ఇప్పటికే ఎలక్ట్రికల్ బస్సు తయారీ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు ఏడాది మార్చి నాటికి దశల వారీగా 314 ఎలక్ట్రికల్ బస్సుల్ని ప్రవేశపెట్టనున్నారు. వీటిని భాగ్యనగరంతో పాటు మరో ఐదు జిల్లాలకు కేటాయించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. వాటిలో.. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాలున్నాయి. ఇప్పటికే.. హైదరాబాద్ లోని వివిధ డిపోల్లో ఎలక్ట్రికల్ బస్సులు సేవలందిస్తున్నాయి. అలాగే.. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయి. వాటికి అదనంగా.. మరోమారు నూతన బస్సుల్ని కేటాయించారు. ఇటీవలే.. వరంగల్ జిల్లాకు 50 ఈ-బస్సుల్ని కేటాయించిన ఆర్టీసీ అధికారులు.. త్వరలో అందుబాటులోకి రానున్న బస్సుల్లో నుంచి జిల్లాలకు కేటాయింపులు చేయనున్నారు. వరంగల్ కు 36, స్యూర్యాపేటకు 52, నల్గొండకు 65, కరీంనగర్ డిపోకు 33, నిజామాహాబాద్ జిల్లాకు 54 బస్సుల్ని కేటాయించారు.
కరీంనగర్-2 డిపోలో ఇప్పటికే 41 ఈ-బస్సులు సేవలందిస్తున్నాయి. వీటిలో 35 సూపర్ లగ్జరీ బస్సులు, 6 డీలక్స్ బస్సులున్నాయి. వీటిని.. కరీంనగర్ – జేబీఎస్, కరీంనగర్ – సిరిసిల్ల, కరీంనగర్ – వరంగల్ మార్గాల్లో నడిపిస్తున్నారు. అత్యధిక రద్దీ ఉన్న మార్గాలు, ప్రయాణికుల నుంచి డిమాండ్ ఉన్న వైపు ఈ బస్సుల్ని నడుపుతున్నారు. అలాగా.. నిజామాబాద్ రెండో డిపోలో 13 ఈ బస్సులు ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడిస్తున్నారు. వీటిలో అన్నీ సూపర్ లగ్జరీ బస్సులే కాగా.. నిజామాబాద్-జేబీఎస్ మార్గంలో ఇవి రాకపోకలు సాగిస్తున్నాయి.
ప్రస్తుతం శిలాజ ఇంధనాలైన డీజిల్ తో నడుస్తున్న బస్సులతో భారీగా వాయు కాలుష్యం ఏర్పడుతుంది. వాయు నాణ్యతను మెరుగుపరచడంతో పాటు డీజిల్ ఖర్చును ఆదా చేసేందుకు ఈ-బస్సులు ఉపయోగపడనున్నాయి. ఓ లెక్క ప్రకారం.. గ్రేటర్ పరిధిలోని 25 బస్ డిపోల నుంచి 2,870 బస్సులు నిత్యం ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. కాగా.. టీజీఎస్ఆర్టీసీ బస్లులు రోజుకు 6 లక్షల లీటర్ల డీజిల్ ని వినియోగిస్తున్నట్లు అంచనా. ఈ బస్సుల ద్వారా సగటున రోజుకు 24.12 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని అంచనా. ఈ స్థాయిలో ప్రయాణాల కారణంగా.. రోజూ 409 టన్నుల కాలుష్య ఉద్గారాలు వెలువడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Also Read : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తృటిలో తప్పిన పెను ప్రమాదం.. పేలిపోయిన కారు రెండు టైర్లు..
ఈ-బస్సుల కారణంగా టీజీఎస్ ఆర్టీసీకి మంచి లాభాలుంటాయని ఆధికారులు అంచనా వేస్తున్నారు. డీజిల్ బస్సుల కారణంగా.. ఆర్టీసీ ఆదాయంలో మెజార్టీ వాాటా ఇంధనానికే పోగా, మిగతా వాటిలోనే సిబ్బంది జీతభత్యాలు, మెయింటెనెన్స్ సహా.. ఇతర అవసరాలు తీర్చాల్సి వస్తుంది. అదే.. ఈ బస్సులు అయితే.. ఇంధన ఖర్చు రోజుకు దాదాపు రూ.3 కోట్ల వరకు ఆదా అవుతాయని అధికారులు తెలుపుతున్నారు. దాంతో పాటే మెయింటెనెన్స్ ఖర్చులు పెద్దగానే కలిసి వస్తాయని తెలుపుతున్నారు. వాటితో పాటే.. వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా కట్టడి చేయనున్నారు.