Hyderabad Old City: సంక్రాంతి అంటేనే పతంగులు ఉండాల్సిందే. చిన్నా పెద్దా తేడా లేకుండా పతంగులు ఎగురవేసేందుకు ఆసక్తి చూపుతారు. అందుకేనేమో హైదరాబాద్ కు చెందిన ఓ గోల్డ్ మ్యాన్ వినూత్న రీతిలో ఆలోచించాడు. సోషల్ మీడియాలో హల్చల్ చేశాడు. అది కూడ రూ. కోటి విలువగల బంగారు పతంగును ఎగురవేస్తున్నట్లు, అలాగే రూ. 40 లక్షల విలువగల బంగారు మాంజాను తయారు చేసినట్లు కూడ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనితో ఇంతకు ఇది వాస్తవమా కాదా అనే బదులు ఇలాంటి ప్రకటనలు తొక్కిసలాటకు దారితీస్తాయన్న కోణంలో పోలీసులు అలర్ట్ అయ్యారు.
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన గోల్డ్ మ్యాన్ సూర్యభాయ్ పేరుతో ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సంక్రాంతిని పురస్కరించుకొని కోటి రూపాయల గోల్డ్ పతంగును ఎగురవేస్తున్నట్లు ప్రచారం సాగింది. దీనితో ఎలాగైనా కోటి రూపాయల పతంగ్ కోసం ఎగబడుతున్నారట ఓల్డ్ సిటీ యువత. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో యువకులందరూ ఓల్డ్ సిటీ బాట పట్టారని సమాచారం. అంతేకాదు రూ. 40 లక్షల విలువ గల మంజా సైతం సిద్ధమంటూ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో హైప్ కోసం ఇటువంటి ప్రచారాలు సాగుతున్నాయన్న వాదన కూడా లేకపోలేదు. ఈ విషయం తెలుసుకున్న సౌత్ జోన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కోటి రూపాయల కైట్ కోసం యువకులు ఒక్కసారిగా గుమికూడి ఘర్షణకు దిగితే పెను ప్రమాదం పొంచి ఉందని పాతబస్తీ వాసులు తెలుపుతున్నారు.
Also Read: Scientist Jobs in CRRI: ఈ అర్హత ఉన్న వాళ్లకు గోల్డెన్ ఛాన్స్.. నెలకు రూ.1,35,000.. DON‘T MISS..
ఇటీవల సోషల్ మీడియాలో హైలెట్ కావడమే లక్ష్యంగా కొందరు యువకులు డబ్బులు విసిరి వేసిన ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ కూడ చేశారు. ఈ తరుణంలో కోటి రూపాయల గోల్డ్ కైట్ అంటూ ప్రచారం సాగడం పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సాయంత్రం పతంగును ఎగురవేయనున్నట్లు ప్రచారం సాగడంతో, పోలీసులు ఈ ప్రకటన ఏ మేరకు వాస్తవమో తెలుసుకునేందుకు విచారిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఇటువంటి ఫేక్ ప్రచారాలను నమ్మరాదని, ఇవి కేవలం సోషల్ మీడియాలో హైలెట్ కోసం చేస్తున్న చర్యలుగా పోలీసులు అభిప్రాయపడుతున్నారు.