Dussehra Special Buses: దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) సన్నద్దమైంది. ఈ పండగకు 7 వేల ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. కరీంనగర్ జోన్ నుంచి మొత్తం 3533 బస్సులు నడుపనున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఆదిలాబాద్ రీజియన్ లో 431 బస్సులు, నిజామాబాద్ 719, కరీంనగర్ 1175, వరంగల్ 530, ఖమ్మం 678 నడుపుతామని ప్రకటించింది. ఒక్క హైదరాబాద్ జోన్ నుంచి 2155 బస్సులు నడుపుతుండగా, మహబూబ్ నగర్ 645, మెదక్ 255 , నల్గొండ 815, రంగారెడ్డి 440, గ్రేటర్ హైదరాబాద్ జోన్ నుంచి 1312 దసరా పండగ కు ప్రత్యేక సర్వీసులను నడపాలని నిర్ణయించింది.
ఈ నెల 9,10,16, 17 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ఆయా రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్రణాళికలు రూపొందించింది. ఈ నెల 25, 26 తేదీల్లో తిరుగు ప్రయాణ రద్దీకి సంబంధించి తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ (నల్ల చెరువు) , ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, KPHB, బోయిన్ పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతున్నట్లు పేర్కొంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వాటిని ఆయా రూట్లలో నడపనుంది.
స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే 1.5 వరకు టికెట్ ధరలను సవరించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం ప్రతి ప్రధాన పండుగకు 1.5 వరకు టికెట్ ధరలను ఉమ్మడి కార్పొరేషన్ గా ఉన్నప్పటి నుండి అమలు చేస్తుంది. స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉండనున్నాయి.
పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ రెగ్యులర్, స్పెషల్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుందని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి స్పష్టం చేశారు. రిజర్వేషన్ ను www.tgsrtcbus.in వెబ్ సైట్ లో బుక్ చేసుకోవాలని యాజమాన్యం తెలిపింది. సమాచారం కోసం 040-69440000, 040-23450033 లలో సంప్రదించాలని యాజమాన్యం సూచించింది.
Also Read: ప్రపంచంలోనే బుల్లి నది.. పొడవు కేవలం 20 మీటర్లే.. కనుచూపు మేరలోనే కనుమరుగు!