Housing Board Land’s : ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేసే కబ్జాదారుల ఆటలకు చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు వివిధ రకాల భూముల్ని కబ్జాలు చేస్తూ, ప్రభుత్వానికి నష్టం చేస్తున్న వారిని గుర్తించి, ఆయా భూముల్ని సంరక్షించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హౌసింగ్ బోర్డు, దక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ( దిల్) భూముల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఒక వైపు ఇప్పుడున్న భూములను పరిరక్షిస్తూనే, మరోవైపు గతంలో ఆక్రమణలకు గురైన భూములను తిరిగి దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ దిశగా ఇప్పటికే చేపట్టిన అనేక చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. దాంతో.. మరింత వేగంగా, సమర్థవంతంగా భూముల రక్షణ చర్యలు చేపడుతున్నారు.
రాష్ట్రంలోని అల్పాదాయ, మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా, ఆయా వర్గాల ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఉమ్మడి రాష్ట్రంలో హౌసింగ్ బోర్డు ఏర్పాటైంది. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఆలోచన చేసి హౌసింగ్ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ హౌసింగ్ బోర్డు(Housing Board), దక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (DIL) హౌసింగ్ బోర్డుల పరిధిలో వేల ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూముల్లో ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. ఈ మూడు జిల్లాల్లో దాదాపు ఐదు వందల ఎకరాల వరకూ భూములున్నాయి. వీటి విలువ మార్కెట్లో రూ.లక్షల కోట్లు ఉంటుంది.
ఐతే.. ప్రభుత్వ సంస్థలకు చెందిన ఈ భూములను గతంలో కొన్ని సంస్థలకు వివిధ కారణాలతో కేటాయింపులు జరిపారు. జాయింట్ వెంచర్ కింద వివిధ సంస్ధలకు కేటాయించి, అభివృద్ధి పనులకు అందించారు. కానీ. వాటిలో కొన్ని సంస్థలు నిబంధనల మేరకు భూములను వినియోగించలేదు. ఆ భూములను గుర్తిస్తున్న ప్రభుత్వ వర్గాలు.. ఆయా భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాయి. వాటిని పేదల, మధ్య తరగతి వర్గాల వారిని ఉపయోగపడేలా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు.
గత ప్రభుత్వాల హయాంలో ఆయా భూముల సంరక్షణపై సరైన పర్యవేక్షణ, పరిరక్షణ కరవైంది. దాంతో.. ప్రభుత్వ స్థలాల్ని కబ్జాలు చేసి పెద్ద భవంతులు, కమర్షియల్ కాంప్లెక్సులు కట్టేశారు. అదే దారిలో మిగతా భూములపైనా అక్రమార్కుల కన్ను పడింది. ఈ భూములను ఎప్పుడెప్పుడు ఆక్రమిద్దామా అన్నట్లు చూస్తున్నారు. ఇందులో చాలా భూముల వ్యవహారం కోర్టుల పరిధిలో ఉండిపోయింది. అనేక భూముల వివాదాలు కోర్టులో ఏళ్లకు ఏళ్లు నానుతున్నాయి. ఇలాంటి వాటన్నింటిన్నింటీ చెక్ పెడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ.25 కోట్లతో ప్రహారీ గోడలను నిర్మించేందుకు సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ హౌసింగ్ బోర్డు 20 జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ లను చేపట్టింది. ఇందులో 14 ప్రాజెక్ట్ లు పూర్తికాగా మిగిలిన ప్రాజెక్ట్ లు కోర్టు కేసుల్లో ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. భూముల పరిరక్షణతో పాటు కోర్టు కేసులలో ఉన్నప్రాజెక్టుల్లో ప్రభుత్వ వాదనలు బలంగా వినిపించేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఈ చర్యలతో వేల కోట్ల రూపాయిల విలువ చేసే 18 ఎకరాల భూములను రెండు సంస్థలు నుంచి స్వాధీనం చేసుకున్నారు.
ఆర్బిట్రేషన్ అవార్డును అనుసరించి ఇందులో.. ఈస్ట్రన్ ప్రావిన్స్ ప్రాజెక్ట్ లిమిటెడ్, బండ్లగూడకు సంబంధించిన ఒప్పందం మేరకు అభివృద్ధి చెయ్యని, LIG ఇళ్లు నిర్మించని కారణంగా.. ఈ ప్రాజెక్టుకు కేటాయించిన 10.41 ఎకరాల స్థలాన్ని స్వాధీనపరుచుకున్నారు. అంతే కాకుండా భవిష్యత్తులో మరోమారు ఇలాంటి పరిస్థితులు రాకుండా.. ఆయా భూముల చుట్టూ భారీ ప్రహరీ గోడలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
అలాగే.. మధుకాన్ ప్రాజెక్ట్ నుంచి 7.32 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. యూనివర్సల్ డెవలపర్స్ గచ్చిబౌలి , కూకట్‌పల్లిలో ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీని సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. ఆయా భూముల్ని స్వాధీనంలోకి తీసుకుంది.
జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ ద్వారా హౌసింగ్ బోర్డుకు ఎంతో కాలంగా రెవెన్యూ వాటా కింద రావాల్సిన రూ.589 కోట్లకు గాను.. గతేడాది రూ.45 కోట్లు వసూలు చేసింది. హౌసింగ్ బోర్డు, దిల్ బోర్డులకు సంబంధించిన ఖాళీ స్థలాలకు జియోట్యాగింగ్ చేసి విలువైన భూములను కాపాడేందుకు చర్యలు చేపట్టింది. అంతే గాక రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఓపెన్ ల్యాండ్స్ కోసం డీజీపీఎస్ సర్వే నిర్వహిస్తున్న ప్రభుత్వం.. ఆయా భూములను జియో ట్యాగ్ చేస్తోంది. ఇప్పటికే.. హౌసింగ్ బోర్డుకు చెందిన 703 ఎకరాల ఖాళీ స్థలాలకు జీపీఆర్‌ఎస్ సర్వే నిర్వహించింది.
హౌసింగ్ బోర్డుకు చెందిన 410 ఎకరాల భూములకు 18 ప్యాకేజీల కింద రూ.10 కోట్ల విలువైన టెండర్లు పిలిచి పనులు చేపట్టగా.. ఇప్పటికే కాంపౌండ్ వాల్స్ దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయి. అలాగే.. దిల్ బోర్డుకు సంబంధించిన 943.52 ఎకరాల భూములకు 15 ప్యాకేజీల కింద రూ.10 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ప్రహరీ గోడ ఈ ఏడాది జూన్ నెలాఖరులోగా పూర్తి కానుంది. వీటిలో పాటు భూముల రక్షణకు సి.సి కెమెరాలతో పాటు, సెక్యూరిటీ గార్డుల నియామకం ద్వారా గట్టి చర్యలు తీసుకుంటోంది. రానున్న కాలంలో సిసి టీవీలను కూడా శాటిలైట్ మానిటరింగ్ సిస్టమ్‌తో అనుసంధానించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కాగా.. ఈ భూముల రక్షణకు ఏవో ప్రకటనలతో సరిపెట్టకుండా.. హౌసింగ్ బోర్డు ఖాళీ స్థలాల ప్రహరీగోడల నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరు చేశారు. కాగా.. ఇప్పటి వరకు 28,499 రన్నింగ్ మీటర్ల ప్రహరీ నిర్మాణం వివిధ దశలలో ఉండగా, శరవేగంగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.