Dharani Portal: కేసీఆర్ హయాంలో ధరణి ద్వారా ఎన్ని మోసాలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బీఆర్ఎస్ గతంలో ప్రవేశపెట్టిన ధరణి ఎంతటి దళిత వ్యతిరేఖమో తెలియ చెప్పే ఉదంతమిది. సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌లో దళితుల భూములను కాజేసిన ధరణి ఆగడాలేంటో ఇప్పుడు చూద్దాం.
నారాయణపేట జిల్లా, కొస్గి పరిధిలోని మల్రెడ్డి పల్లె గ్రామం. ఇక్కడి దళిత రైతులు.. గ్రామ శివార్లలోని 391, 392, 376 సర్వేనెంబర్ లలో ఇనాం భూములను తాత ముత్తాతల కాలం నుండి అనుభవిస్తున్నారు. ఈ భూములు కోస్గి పట్టణానికి చెందిన కోల్కొంది లక్ష్మణ శర్మ కుటుంబ సభ్యుల నుంచి.. కామారం వెంకటేష్ మరో 10 దళిత కుటుంబాలకు అనుభవించేందుకు హక్కులు కల్పించారు. అంతేకాకుండా 1947 వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వాలు దళితులకు భూ యజమానుల దగ్గర హక్కులు కల్పించి టేనెన్సీ యాక్ట్ ప్రకారం సీలింగ్ భూములు అందజేశారు. ఆనాటి నుంచి ఈ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయీ దళిత కుటుంబాలు.
1996లో నాటి కోస్గి తాసిల్దార్ వీరిని భూ ప్రొటెక్టెన్సీ దారులుగా ప్రకటిస్తూ.. ఈ భూముల్ని సంబంధిత దళితులకు అప్పజెప్పారు. అంతా సజావుగా జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన ధరణి పోర్టల్ వీరి పాలిట శాపంగా మారింది. ధరణి పోర్టల్ లో అనుభవదారుల కాలం తీసివేయడంతో కొందరీ భూములపై కన్నేశారు. ఈ లొసుగును ఆసరాగా చేసుకున్న బీఆర్ఎస్ నేతలు తమ భూముల్ని గతంలో ఇచ్చిన వారితో కుమ్మక్కై అమ్మకానికి సిద్ధం చేశారని బాధ పడుతున్నారు.
సమస్య తలెత్తిన వెంటనే వీరంతా కలసి.. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి తమకొచ్చిన కష్టం గురించి చెప్పుకున్నారు.. ఇప్పటికి ఎన్నోసార్లు నాటి ఎమ్మెల్యే కి చెప్పినా పెద్దగా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారీ దళిత రైతులు. సరే చూద్దాం చేద్దాం అంటూనే ఆ భూముల అమ్మకానికి ఆయనే తెర లేపాడన్నది ఈ భూముల్లో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్న దళిత రైతుల ప్రధాన ఆరోపణ.
ధరణి పోర్టల్ రాకతో ఈ భూమికి సంబంధించి గత యజమానులకు పట్టా పాస్ బుక్కులు వచ్చాయి. దీన్ని ఆసరాగా చేసుకుని గత ప్రభుత్వ హాయంలో మల్ రెడ్డి పల్లి కౌన్సిలర్ గా ఉన్న లింగం లక్ష్మమ్మ సోదరులు ఈ భూమిపై కన్నేశారనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారీ వ్యవసాయదారులు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహకారంతోనే ధరణిలో రిజిస్ట్రేషన్ పేరు మార్పు చేసి తమ పేర్లు వచ్చేలా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారీ దళిత రైతన్నలు. తాజాగా ఈ భూములు తమవేనంటూ లింగం లక్ష్మమ్మ సోదరులు దున్నడానికి రాగా వీరిని తమ సాయశక్తులా అడ్డుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇదే భూమిపై ఆధారపడి తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని అలాంటి భూముల్ని మా నుండి దూరం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.
Also Read: Koushik Reddy : నేను రాజీనామా చేస్తా.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సిద్ధమా?
ట్రాక్టర్ తో పొలం చదును చేయడానికి వచ్చిన లింగం లక్ష్మమ్మ సోదరులను అడ్డుకున్నారీ దళిత సోదరులు. తమ ప్రాణం పోయినా సరే, భూమిని వదులుకునే ప్రసక్తే లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇదంతా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రోత్బలంతోనే జరుగుతోందని.. ధర్నాకు దిగారు దళితులు. భూములు వదులుకోకుంటే మీ అంతు చూస్తామంటూ లింగం సోదరులు భయపెడుతున్నారని.. ప్రభుత్వం తమకు రక్షణ కల్పించి.. తగిన న్యాయం చేయాలని దళిత రైతులు డిమాండ్ చేస్తున్నారు.