Hyderabad News: కశ్మీర్ లోని పహల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో నివసిస్తున్న పాకిస్థానీయుుల వీసాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. నిర్దేశిత గడువులోగా పాకిస్థాన్ పౌరులు దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న పాక్ పౌరులకు కొత్త టెన్షన్ మొదలైంది.
కేంద్రం ఆదేశాలతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్‌లో నమోదైన పాకిస్థాన్ పౌరుల వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. విదేశీయులు శంషాబాద్‌లోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందందని అధికారులు చెప్పారు.
హైదరాబాద్‌లో 230 మంది పాకిస్థానీలు..
ఈ క్రమంలోనే డీజీపీ జితేందర్ కీలక విషయాలు వెల్లడించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు పాకిస్తానీలను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో 230 మంది పాకిస్థానీయులు ఉన్నారని అన్నారు. వీరిలో 199 మంది లాంగ్ టర్న్ వీసాలు కలిగి ఉన్నారని తెలిపారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఈ లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నవారి జోలికి వెళ్లట్లేదని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. మిగిలిన 31 మందికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నాయని చెప్పారు.
ఈ నెల 29 వరకు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలి..
ఈ షార్ట్ టర్మ్ వీసాలు కలిగి ఉన్న వారిని గుర్తిస్తున్నామని డీజీపీ తెలిపారు. లీవ్ ఇండియా పేరుతో ఇప్పటికే కొంతమందికి నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. హెల్త్ బేస్ మీద వీసాలు తీసుకున్న వారికి ఈ నెల 29 వరకు టైం ఉందని స్పష్టం చేశారు. మిగిలిన వారు తిరిగి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30 వరకు అటల్ బోర్డర్ నుండచివెళ్ళిపోవచ్చని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వెళ్లిపోని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..
షార్ట్ టర్మ్ వీసాలు ఉండి తిరిగి వెళ్ళిపోని పాకిస్తానీయుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి కో-ఆర్డినేషన్ లో జాయింట్ ఆపరేషన్ చేస్తామని చెప్పారు. కర్రెగుట్టలో తెలంగాణా పోలీస్ శాఖ నుండి ఎలాంటి ఆపరేషన్ లేదని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర పోలీస్ బలగాలు తెలంగాణా ప్రాంతంలో ఉన్న కర్రెగుట్టల వద్ద ఎలాంటి ఆపరేషన్ నిర్వహించలేదని డీజీపీ జితేందర్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read: