Heavy Rain: గత రెండు మూడు రోజుల నుంచి తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. అంతకు ముందు అక్కడక్కడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు మాత్రమే కురిశాయి. ఈ ఏడాది మే చివరి వారంలో వర్షాలు దంచికొట్టిన విషయం తెలిసిందే. మళ్లీ జులై మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి. జూన్ నెలలో మాత్రం వర్షాలు పడక రైతులు ఆందోళన చెందారు. ఈసారి వర్షాలు సమృద్దిగా కురుస్తాయని రైతులు కాస్త ముందస్తుగానే వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. మే నెల చివరి వారంలోనే పత్తి గింజలు, నార్లు పోశారు. అయితే ఆ తర్వాత జూన్ నెల వర్షాలు పడకపోవడంతో రైతులు కొంత నిరాశ చెందారు.. ఎప్పుడెప్పుడు వర్షాలు పడుతాయా? అని ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. నిన్న హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం పడగా.. రాష్ట్రంలో పలు చోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడ్డాయి. కొన్ని జిల్లాల్లో అయితే వర్షం పడక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కోసం ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
⦿ 2 గంటల్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం..
ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేసింది. రాబోయే 2 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు రాత్రి 7 గంటల సమయంలో హైదరాబాద్, జనగాం, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అలాగే ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరం అయితే తప్పు బయటకు రావొద్దని చెప్పారు.
⦿ ఈ హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించండి..
ఇప్పటికే భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఇక రాబోయే గంట సేపట్లో పలు ఏరియాల్లో వర్షం దంచికొట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా ఉండేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ ఆదేశించారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉండడం లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇంట్లోనే ఉండాలని సూచించారు. వర్షాల వల్ల ఎవరికైనా ఇబ్బందులకు గురైతే జీహెచ్ఎంసీ- డీఆర్ఎఫ్ ను 040-29555500, 040-21111111 లేదా 9000113667 నంబర్లను సంప్రదించాలని ఆమె చెప్పారు.
⦿ పిడుగులు పడే ఛాన్స్.. జాగ్రత్త
తెలంగాణలో ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడిన భారీ వర్షం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లొద్దని.. ముఖ్యంగా చెట్ల కింద నిలబడొద్దని సూచిస్తున్నారు. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. అత్యవసరం అయితే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
ALSO READ: PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు పడకపోవడానికి కారణాలేంటి? ఇప్పుడు వెంటనే ఇలా చేయండి..
ALO READ: Intelligence Bureau: సూపర్ న్యూస్.. ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది..