
BRS party latest news(Political news in telangana):
బీఆర్‌ఎస్‌లో టికెట్ల లొల్లి అధిష్టానానికి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్, బీజేపీల కంటే ముందుగానే పెద్ద సంఖ్యలో అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటి నుంచి.. అసంతృప్తుల సెగ చల్లారడం లేదు. సిట్టింగ్‌లకు టికెట్లను కట్టబెట్టడం మింగుడుపడని నేతలు.. పెద్దఎత్తున వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పెద్దల బుజ్జగింపులకు ఎవరూ తలొగ్గడం లేదు. అలాగే చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి కూడా నిరసన సెగలు ఎదరవుతున్నాయ్.
నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. చిట్టెం హటావో.. మక్తల్ బచావో నినాదంతో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. చిట్టెం ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలంటూ బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. జైకేసారంలో సీపీఎం, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. 8 ఏళ్ల నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేదని.. అభివృద్ధి చేయలేదని అడ్డగించారు. తనను అడ్డుకున్న కాంగ్రెస్, సీపీఎం నేతలపై సీరియస్ అయ్యారు కూసుకుంట్ల. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఉనికి కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే.
ఇటీవలే బీఆర్ఎస్ రెబల్ నేత, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ తన అనుచరులతో భేటీ అయ్యారు. ఇప్పటికే బీఆర్ఎస్‌కి రాజీనామా చేసిన సంతోష్ కుమర్.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారు. భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకు తాజాగా తన అనుచరులతో సమావేశమయ్యారు.
అలంపూర్‌లోనూ వర్గపోరు అంతాఇంతా కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు వ్యతిరేకంగా శ్రేణులు తిరుగుబాటుకు దిగారు. ఈ అభ్యర్థి మాకొద్దు అంటూ పలువురు లీడర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అబ్రహంకు బీఫామ్ ఇవ్వొద్దని వ్యతిరేక వర్గం డిమాండ్ చేస్తోంది.