
PM Modi Telangana Tour(Telugu news headlines today): ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఓరుగల్లుకు రానున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఓరుగల్లు కేంద్రంగా.. బీజేపీ ఎన్నికల రణభేరిని మోగించేందుకు రెడీ అయ్యినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభలు నిర్వహించి బల ప్రదర్శన చేశాయి. ఇక ఇప్పుడు తన వంతు అన్నట్టుగా భారీగా బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ. దాదాపు 5 లక్షల మందిని సభకు తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నారు కమలనాథులు.
ప్రధాని మోదీ పర్యటన అధికారమే అయినా.. సభా సమయాన్ని మాత్రం అన్‌అఫిషియల్‌గా పేర్కొన్నారు. SPG మినిట్ టు మినిట్ షెడ్యూల్‌లో దీనిని ఇలాగే తెలిపారు. దీంతో మోదీ ప్రసంగంలో ఇతర పార్టీలపై విరుచుకపడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. మరోవైపు కిషన్ రెడ్డి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి సభ కావడంతో.. ఆయన దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. శుక్రవారం ఆయన వరంగల్‌కు చేరుకొని సభ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.
ప్రధాని సెక్యూరిటీ బాధ్యతలను నిర్వహించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌తోపాటు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆఫీసర్లు ఇప్పటికే వరంగల్‌లో మకాం వేశారు. ఎస్‍పీజీ బలగాలు సభాస్థలిని తమ కంట్రోల్ లోకి తీసుకున్నాయి. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అడిషనల్ డీజీపీ విజయ్ భద్రతపై రివ్యూ చేశారు. 20 కిలోమీటర్ల పరిధిలో హనుమకొండ, వరంగల్ సిటీల చుట్టూ నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. గ్రేటర్ వరంగల్ లో 144 సెక్షన్ విధించారు. ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు.
వరంగల్ లో రూ. 6, 100 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు మోదీ. అందులో రూ. 5,550 కోట్లతో 176 కిలో మీటర్ల నేషనల్ హైవే నిర్మాణం చేపడతారు. మరో రూ. 500 కోట్లకు పైగా నిధులతో ఏర్పాటు చేయనున్న కాజీపేట రైల్వే వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‍కు శంకుస్థాపన చేస్తారు.