Heavy Rains: తెలంగాణకు రెయిన్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది. ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురుస్తాయని తెలిపారు. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. తూర్పు ఈశాన్య దిశలో కొనసాగుతున్న రుతుపవన ద్రోణి ఉపరితల ఆవర్తనం కారణంగా.. రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.
పలు జిల్లాల్లో భారీ వర్షాలు..
ఇవాళ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాలతో పాటు.. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్.. నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు.
నిన్న హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం
నిన్న హైదరాబాద్ మహానగరంలో కుండపోత వర్షం కురిసింది. నగరవ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి పలు చోట్ల రహదారులు చెరువులను తలపించాయి. సిటీలో దాదాపు గంటన్నర పాటు కుండపోత వాన పడింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్న మాదిరిగా భారీ వర్షం కురిసింది. వరుణుడు ఉగ్రరూపం చూపించడంతో నగరంలోని రోడ్లన్నీ నదులను తలపించాయి. భారీగా వరద నీరు రోడ్లపైకి చేరడంతో సిటీలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలో మీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే నగర ప్రయాణికులు మెట్రో బాట పట్టడంతో స్టేషన్లు కిటకిటలాడాయి. మరోవైపు వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు పడ్డాయి.
హయ్యెస్ట్ రికార్డు కొట్టిన వర్షం..
నిన్న రెండుగంటల్లో నగరంలో కురిసిన వర్షం.. ఈ ఏడాదిలోనే హయ్యెస్ట్ రికార్డుగా నమోదైనట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. కుత్బుల్లాపూర్ లో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. షేక్ పేట్ లో 12.4, బంజారాహిల్స్ 12.5 సెంటీమీటర్లు, యూసుఫ్ గూడలో 11.7, శ్రీనగర్ కాలనీ- 10.6, కూకట్ పల్లిలో 10 సెంటీమీటర్లు, మైత్రీవనంలో 9.2, మూసాపేటలో 7.9, జూబ్లీహిల్స్ లో 7.4, మెహదీపట్నంలో 5.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.
Also Read: ఇదేక్కడి అన్యాయం.. కూతురికి వైద్యం సరిగా చేయలేదని ప్రశ్నించినందుకు తండ్రిపై దాడి
అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.