Tobacco And Paan Stains In UK: సాధారణంగా భారత్ లో పబ్లిక్ ప్రదేశాల్లో పాన్ మరకలు కనిపిస్తుంటాయి. పొగాకు ఉత్పత్తులు, తంబాకు నమిలి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా థియేటర్లు సహా ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేస్తుంటారు. ఇప్పుడు, ఈ సంస్కృతి లండన్ కు పాకింది. గత కొంత కాలంగా లండన్ వీధుల్లో పొగాకు, పాన్ ఉమ్మివేయడం లాంటి మరకలు దర్శనం ఇస్తున్నాయి. తాజాగా లండన్ పాన్ మరకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రిపోర్టుల ప్రకారం, రేనర్స్ లేన్ నుంచి నార్త్ హారో వరకు పలు ప్రాంతాల్లో పాన్ మరకలు కనిపించాయి.
వైరల్ వీడియోలో ఏం ఉందంటే?
తాజాగా వైరల్ వీడియోలో చెత్తబుట్టలు, ఫుట్ పాత్ లు, రోడ్లు సహా పలు బహిరంగ ప్రదేశాల్లో ముదురు ఎరుపు రంగు మచ్చలు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయి. రేనర్స్ లేన్ జిల్లాలో ఈ మరకలు పెరిగాయని స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా పొగాకు ఉత్పత్తులను విక్రయించే దుకాణాల వెలుపల పాన్ మరకలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు.హారో పోర్టర్ ప్రకారం, నార్త్ హారోలో కొత్తగా ప్రారంభించిన పాన్ దుకాణంపై ప్రజలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ దుకాణం కారణంగా ఆ ప్రాంతంలో పాన్ నమలడం, ఉమ్మివేయడం పెరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
యూకేలోని భారతీయులే కారణమా?
వీధుల్లో ఎర్రటి మరకలను చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత, ఈ పరిస్థితికి వలస వచ్చినవారు.. ముఖ్యంగా ఇండియా నుంచి వచ్చిన వారే కారణం అని ఆరోపిస్తున్నారు. “గుజరాతీలు, పంజాబీలు, గోవా వాసులు అందరూ యూకేలో ఉంటున్నారు. ఎక్కువగా పాన్ మరకలకు వీళ్లే కారణం అవుతున్నారు” అని ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. “భారతదేశం ప్రతిష్టను నాశనం చేయడానికి మాకు ఇతర వ్యక్తులు అవసరం లేదు. మన ప్రజలు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తమ వంతు కృషి చేస్తున్నారు” అని ఇంకో వ్యక్తి రాసుకొచ్చాడు. “భారత పాస్ పోర్ట్ దాని గౌరవాన్ని కోల్పోవడానికి ఒక కారణం ఇలాంటి పనులే” అని మరొకరు వ్యాఖ్యానించారు. “బ్రిటిష్ వారు భారతదేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు భారతీయులు బ్రిటన్ ను స్వాధీనం చేసుకుంటున్నారు” అని ఇంకో వ్యక్తి ఫన్నీగా కామెంట్ చేశాడు.
2019లో పోలీసుల హెచ్చరికలు
పబ్లిక్ ప్రదేశాల్లో పాన్ నమిలి ఉమ్మి వేయకూడదంటూ 2019లో లీసెస్టర్ సిటీ పోలీసులు ఇంగ్లీష్, గుజరాతీ భాషలో సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. “వీధిలో పాన్ నమిలి ఉమ్మివేయడం అపరిశుభ్రమైన పని. సామాజిక వ్యతిరేకమైనది. అలా చేస్తే జరిమానా విధించాల్సి ఉంటుంది” అని సైన్ బోర్డులో రాశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే $150 (సుమారు రూ. 12,525) జరిమానా విధించబడుతుంది హెచ్చరించారు. 2014లో, బ్రెంట్ కౌన్సిల్ పాన్ మరకలను శుభ్రం చేయడానికి 20,000 పౌండ్లు (రూ. 21 లక్షలు) ఖర్చు చేసిందని స్థానిక పత్రికలు వెల్లచాయి. ఇప్పటికైనా యూకే నివాసితులు ఈ పద్దతి మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Also: బెట్, ఈ బనానాను ఒక్కరే తినలేరు.. చరిత్రలో అత్యంత పెద్ద అరటి పండు పొడవు ఎంతో తెలుసా?