Mahesh Kumar Goud: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెప్పిందొకటి.. చేసింది మరొకటి. అది చేస్తాం.. ఇది చేస్తామంటూ జనానికి అన్యాయం చేశారు. అభివృద్ధి పేరుతో ఊర్లకు ఊర్లు ఖాళీ చేయించి జనాన్ని నట్టేట ముంచారు. పేరు గొప్ప, ఊరు దిబ్బ. ఇది గత పదేళ్లలో తెలంగాణ పరిస్థితి. అభివృద్ధి పేరుతో సామాన్యులకు కుచ్చుటోపి పెట్టంది నాటి ప్రభుత్వం. ఇంతిస్తాం.. అంతచేస్తాం అంటూ గొప్పలు చెప్పి రైతులను నిండా ముంచారు. న్యాయం కోసం నాయకుల చుట్టు చెప్పులు అరిగేలా తిరిగిన పట్టించుకున్న పాపాన పోలేదు. నాడు అరిగోస పడ్డ బాధితులకు నేడు చేయూతనిస్తుంది హస్తం సర్కార్.
తెలంగాణలో గులాబీ పార్టీ పొజిషన్ ఏంటన్న డిస్కషన్ పెద్ద చర్చే నడుస్తోంది. గత పాలనలో వాళ్లు చేసింది. ఇప్పుడు అధికార పార్టీ చేస్తే తప్పంటున్నారు.. నాకు దక్కనిది ఎవరికీ దక్కొద్దు అన్న ఆలోచనలో అస్త్రశస్త్రాలు ప్రయోగించారు. కానీ ఏం లాభం బెడిసికొడుతోంది. కాంగ్రెస్ పార్టీపై పోరాడుతున్నాం.. ప్రభుత్వాన్ని దింపేస్తాం.. ఇలా పూటకో మాట మాట్లాడుతున్న కారు పార్టీ నేతలకు మరో కంగారు పడే న్యూస్ ఇచ్చారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా మాజీ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో ఉద్యమ పార్టీగా గొప్పలు చెప్పుకునే బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ వెనుకబాటుకు గురైందన్నారు. సెంటిమెంట్ పేరుతో రెండు దఫాలుగా అధికారం చేపట్టి.. గడీల పాలన చేసి ప్రజలను గోస పెట్టారని చెప్పారు.
ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు బుద్ది చెప్పినా మీలో, మీ కుటుంబ సభ్యులు, పార్టీ నేతల్లో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ఉద్యమించిన మీరు పీఠమెక్కాక మాయమాటలతో పాలించారన్నారు. ఉద్యమంలో యువతను రెచ్చగొట్టి వాళ్ల ప్రాణాలకు కారణమయ్యారని ఫైరయ్యారు.
Also Read: బాలకృష్ణ, జానారెడ్డి ఇళ్లకు అధికారుల మార్కింగ్.. ఎందుకు చేశారో తెలుసా
హరీశ్ రావు పెట్రోల్ డబ్బా అగ్గిపులతో డ్రామాలు చేసి అమాయక యువతను బలిదానాలవైపు ప్రోత్సహించారనేది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. అధికారంలోకి వచ్చాక మీ కుటుంబంలోని సభ్యులకే రాజకీయ ఉపాధి కల్పించుకున్నారని విమర్శించారు. మీ హయాంలో ఇచ్చిన అరకొర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లను కూడా పూర్తి చేయలేకపోయారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతి పోటీ పరీక్షలో గందరగోళమే జరిగిందన్నారు.