Mahesh Kumar on BJP: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చేపట్టిన సంక్షేమ పథకాలను మరచి, తెలంగాణ బీజేపీ చార్జిషీట్ ప్రకటించిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తమ ఏడాది కాలం పాలనపై, అలాగే కేంద్రంలో బీజేపీ పదేళ్ల పాలనపై తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ఏడాది కాలవ్యవధిలోనే రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కు దక్కుతుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ వ్యాప్తంగా చీకటి పాలన సాగిస్తుందని, తాము చేసే సవాళ్లు స్వీకరించే సత్తా బీజేపీ నేతలకు ఉందా అంటూ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.
ఎన్నికలకు ముందు నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రతి అకౌంట్ కు రూ.15 లక్షల రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చారని, అంతే కాకుండా 100 రోజుల్లో అన్ని రకాల ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి, నేడు ఆ హామీలను తుంగలో తొక్కిన ఘనత బీజేపీకే దక్కుతుందని తెలిపారు. దేశంలో 411 మంది ఎమ్మెల్యేలను వివిధ పార్టీల నుండి బీజేపీలోకి మార్చారని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేరికలపై మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు.
మతతత్వ రాజకీయాలు చేస్తూ పార్టీలను చీలిస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్న బీజేపీ సుద్దపూస మాటలు మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు. ఏడాదిలో తాము ఏమి చేసామో చెప్పేందుకు తాము సిద్దమని, కానీ 11 ఏళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏమి చేసిందో చెప్పేందుకు బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు.
తెలంగాణలో బీజేపీ పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోవడంతో కొత్తగా చార్జిషీట్ అంటూ బీజేపీ కొత్త రాజకీయాలకు తెర తీసిందని ఆయన విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్ తో బీజేపీ అంట కాగుతుండడంతో స్వయాన ప్రధాని మోడీ చివాట్లు పెట్టడంతో తెలంగాణ బిజెపి నేతలకు అర్థం కాని పరిస్థితి ఉందని, అందుకే వారు చార్జిషీట్ అంటూ హడావుడి చేస్తున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కవల పిల్లలని ఎన్నోసార్లు అది రుజువైందన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న మాట వాస్తవం కాదా అంటూ కిషన్ రెడ్డిని మహేష్ గౌడ్ ప్రశ్నించారు.
2014 నుండి 24 వరకు పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు ఎన్నిసార్లు పెంచారో చెప్పాలని, లేకుంటే ప్రజల ముందే చర్చకు తాను సిద్ధమంటూ మహేష్ గౌడ్ మరోమారు సీరియస్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రాగానే పెండింగ్ ఉద్యోగాలను భర్తీ చేసిందని, గృహజ్యోతి రుణమాఫీ, మహిళలకు ఫ్రీ బస్సు ఇలాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టినా కూడా బీజేపీ నేతలకు కనిపించని పరిస్థితి ఉందన్నారు. అసలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో చర్చించడానికి సిద్ధంగా ఉంటే, కాంగ్రెస్ పార్టీ తరఫున తాను చర్చకు వచ్చేందుకు రెడీ అంటూ మహేష్ గౌడ్ సవాల్ విసిరారు. మరి మహేష్ గౌడ్ కామెంట్స్ కి బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.