Transfer Loopholes: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వ శాఖల్లో సాధారణ బదిలీల హడావుడి మొదలైందంటే చాలు ..కొందరు అధికారులకు, ఉద్యోగులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. ఏళ్ల తరబడి ఒకే చోట తిష్టవేసి, అన్ని విధాలుగా‘అనుకూలమైన’ స్థానాలను వదిలి వెళ్లడానికి వారు అస్సలు ఇష్టపడటం లేదు.నిబంధనల ప్రకారం సుదీర్ఘ కాలంగా ఒకే చోట పనిచేస్తున్న (లాంగ్ స్టాండింగ్) వారిని బదిలీ చేయాల్సి ఉండగా.. ఆ వేటు నుంచి ఎలాగైనా తప్పించుకునేందుకు కొందరు ఉద్యోగులు రకరకాల ‘క్రియేటివ్’ ట్రిక్కులను ప్రయోగిస్తున్నారు.తాజాగా బదిలీల నుంచి తప్పించుకోవడానికి ఈసారి వైద్యారోగ్యశాఖ ఉద్యోగులు కనిపెట్టిన సరికొత్త అస్త్రం ‘సెన్సస్ డ్యూటీ’. నిబంధనల ప్రకారం జనగణన, అత్యవసర ఎన్నికల విధుల్లో ఉన్నవారిని సాధారణ బదిలీల నుంచి మినహాయించే అవకాశం ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకుని, కొందరు ఉద్యోగులు ముందస్తుగానే వ్యూహాత్మకంగా సెన్సస్ విధుల్లో తమ పేర్లు ఉండేలా చూసుకుంటున్నారు. ఆ తర్వాత బదిలీల తుది జాబితా (ఫైనల్ లిస్ట్) నుంచి తమ పేర్లను విజయవంతంగా ‘రీమూవ్’ చేయించుకుంటూ సేఫ్ జోన్ లోకి వెళ్తున్నారు.అంతేగాక తమ సీటు కదలకుండా చూసేందుకు కొందరు కిందస్థాయి సిబ్బంది, కీలక విభాగాల్లోని ఉన్నతాధికారులతో చేతులు కలుపుతున్నారు. బదిలీల లిస్టులు తయారయ్యే ఆఫీసుల్లోనే తిష్టవేసి, లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. సీనియారిటీ జాబితాను తారుమారు చేయడం, లాంగ్ స్టాండింగ్ ఉన్నా కూడా లేనట్టుగా రికార్డులను మేనేజ్ చేయడం వంటి పనులకు కొందరు అవినీతి అధికారులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సజావుగా సాగాల్సిన వైద్యారోగ్యశాఖలో బదిలీల వ్యవహారం అత్యంత విచిత్రంగా తయారైంది.ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన కొందరు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది.. నగరాలు, టౌన్లను వదిలి వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. ఇందుకోసం వారు సృష్టిస్తున్న వింత కారణాలు చూసి ఉన్నతాధికారులు అవాక్కవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. తాజా బదిలీల నుంచి మినహాయింపు పొందేందుకు కొందరు ఫారెన్ సర్వీసెస్ డిప్యుటేషన్ మార్గాలను ఎంచుకుంటున్నారు.రికార్డుల్లో ఒకచోట పోస్టింగ్ చూపిస్తూ, క్షేత్రస్థాయిలో మరోచోట విధులను నిర్వహిస్తూ విచిత్రమైన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. దీంతొ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు కుంటుపడుతున్నాయి.
Also Read: హైదరాబాద్ ప్రేక్షకులకు అదిరిపోయే న్యూస్.. AMB సినిమాస్‌లో ‘HDR బై బార్కో’ టెక్నాలజీ..
బదిలీల నుంచి రక్షణ పొందడానికి ఉద్యోగ సంఘాల (యూనియన్) పేరిట వచ్చే ‘సిఫార్సు లేఖలు’ కీలకంగా మారుతున్నాయి. సాధారణంగా గుర్తింపు పొందిన యూనియన్ల ముఖ్య నాయకులకు బదిలీల నుంచి కొంత మినహాయింపు లేదా ప్రాధాన్యత ఉంటుంది.దీనిని క్యాష్ చేసుకునేందుకు కొందరు సాధారణ ఉద్యోగులు సైతం రాత్రికి రాత్రి యూనియన్ నాయకులను ఆశ్రయిస్తున్నారు. తమకు ఫలానా అనారోగ్య సమస్య ఉన్నదని కొందరు, మరి కొందరు యూనియన్ బలోపేతానికి తాము అవసరం అంటూ లెటర్ హెడ్‌లపై సిఫార్సు లేఖలు రాయించుకునేందుకు తెరవెనుక భారీగా మంతనాలు, రాయబారాలు నడుపుతున్నారు. మరికొందరు బదిలీల ప్రక్రియ ముగిసేవరకు అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు మెడికల్ లీవులు పెట్టడం, సాంకేతిక కారణాలను వెతుక్కుంటూ బదిలీ ప్రక్రియపై స్టే తెచ్చుకునేందుకు ప్రయత్నించడం, మంత్రులు, అధికార పార్టీ నేతల ద్వారా నేరుగా పైస్థాయి నుండి ‘డోంట్ డిస్టర్బ్’ అంటూ ఆదేశాలు ఇప్పించుకోవడం వంటివి కూడా ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు.
వైద్యారోగ్యశాఖకు సెన్సస్ డ్యూటీలు లేవు. కొందరు ఉద్యోగులు అధికారులతో కుమ్కక్కై ఇలా మానిప్యులేషన్ చేస్తున్నారు. 2002 తర్వాత వైద్యారోగ్యశాఖలో గుర్తింపు ఎన్నికలు లేవు. దీంతో సంఘాలు, అసోసియేషన్లు ఆఫీస్ బేరర్స్ లెటర్స్ ఇవ్వడానికి లేదు. అనారోగ్య పరిస్థితులు, స్పౌజ్ కేసులను తప్పనిసరిగా వెరిఫికేషన్ చేసి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది’’. అంటూ హెచ్ 1 యూనియన్ నాయకుడు సాయిరెడ్డి కోరారు.
Also Read: గండిపేట భూ కబ్జా కేసులో సంచలనం.. జీవోల కోసం 4కోట్లు..!