Khammam Road Accident: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యారు. బాధితులను సమీపంలోని ఖమ్మం ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. అసలు ఘటన ఎలా జరిగింది?
ఖమ్మం జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీని వెనుక నుంచి వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీ కొట్టింది. వైరా మండలం సోమవరం గ్రామం గ్రీన్ ఫీల్డ్ హైవే ఎగ్జిట్ పాయింట్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సుకి డ్రైవర్ కి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటన సమయంలో దాదాపు బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో చాలామందికి తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం. లారీని బలంగా ఢీ కొట్టడంతో బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది.
బస్సు కేబిన్‌లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులతోపాటు అంబులెన్స్ వాహనం అక్కడికి చేరుకుంది. క్షతగాత్రులను అంబులెన్సులో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, లోతుగా దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గురైన బస్సు శ్యామోలీ సంస్థకు చెందినది. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ కు బస్సు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ALSO READ: కలలోకి ప్రియుడు రావడంతో యువతి బలవన్మరణం, శంషాబాద్‌లో విషాద ఘటన