రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన గ్రామాల్లో ఐదింటిని తిరిగి తెలంగాణలో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి దీనిపై చర్చ జరుగుతోంది. ఆమధ్య ముఖ్యమంత్రుల భేటీలో కూడా ఏపీ సీఎం చంద్రబాబు ముందు ఈ డిమాండ్ ఉంచారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రాసెస్ లో భాగమే ఈ లేఖ. అయితే ఈ లేఖ తమ విజయం అని చెప్పుకుంటున్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ విలీనం తెలంగాణ జాగృతి విలీనం అంటున్నారు. దీంతో నెటిజన్లు ఆమెను గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. ప్రతి విజయాన్నీ తన ఖాతాలో వేసుకోడానికి కవిత పడుతున్న తాపత్రయం చూస్తుంటే నవ్వోస్తందని అంటున్నారు. అన్ని పార్టీల నేతలు, ఉద్యమకారుల త్యాగాల ఫలితం తెలంగాణ అయితే, రాష్ట్ర ఏర్పాటుని కూడా బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుందని, ఇప్పుడు కవిత కూడా అలాంటి ప్రయత్నాలే చేస్తున్నారని మండిపడ్డారు.
అప్పుడేం చేశారు..?
విలీన గ్రామాలపై బీఆర్ఎస్ కి అంత చిత్తశుద్ధి ఉంటే.. 9 ఏళ్ల పాలనలో ఏనాడూ వాటి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని అంటున్నారు నెటిజన్లు. అలాంటిది కాంగ్రెస్ హయాంలో విలీన గ్రామాలను వెనక్కి తెప్పించే ఏర్పాట్లు జరుగుతుంటే ఇప్పుడు కవిత ఎంట్రీ ఇవ్వడం, అది తమ ఘనతేనని చెప్పుకోవడం విడ్డూరం అంటున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో జాతీయ స్థాయిలో మేనిఫెస్టోని ప్రకటించిన కాంగ్రెస్, తెలంగాణకు ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించింది. అందులో ఐదు గ్రామాలను వెనక్కి తెప్పిస్తామనే హామీ కూడా ఉంది. ఆనాడు ఇచ్చిన హామీ మేరకు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ విలీన గ్రామాల విషయంలో విజయం సాధిస్తోంది. అయితే ఈ విజయాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకోవడం ఇష్టంలేక, అది జాగృతి విజయం అంటూ చెబుతున్నారు కవిత. జాగృతి ఒత్తిడికి దిగివచ్చిన ప్రభుత్వం అంటూ ఓ ట్వీట్ వేసి నవ్వులపాలయ్యారు.
ఇది ఐదు గ్రామాల ప్రజల విజయం
తెలంగాణ జాగృతి ఒత్తిడికి దిగివచ్చిన ప్రభుత్వం
భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా, పట్టణాన్ని ఆనుకుని ఉన్న 5 గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరడం ఆ ఐదు గ్రామాల ప్రజలు, తెలంగాణ జాగృతి సాధించిన విజయం.
కేంద్రంలోని నరేంద్ర… pic.twitter.com/ptmqKoaXML
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 30, 2025
రాష్ట్ర విభజన తర్వాత పాలనా సౌలభ్యం కోసం అంటూ.. నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశారు. ఆ ఆర్డినెన్స్ తో భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తమ పట్టణం, గుండాల గ్రామాలు కూడా ఏపీలో విలీనం అయ్యాయి. ఆ ఐదు గ్రామాల ప్రజలు విద్య, వైద్యం, ఇతర అవసరాల కోసం ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారి దుస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. వాటిని తిరిగి తెలంగాణలో విలీనం చేస్తేనే న్యాయం చేసినట్టవుతుందని అన్నారు. ముఖ్యమంత్రుల మీటింగ్ లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించి, ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు.
విలీన గ్రామాలను తిరిగి తీసుకునే క్రమంలో ఇది మరో ముందడుగు అని చెప్పవచ్చు. అటు ఏపీ కూడా ఆయా గ్రామాలను తిరిగి ఇచ్చే విషయంలో సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగితే విలీన గ్రామాలు తిరిగి తెలంగాణలో చేరడం పెద్దపనేం కాదు. ఎలాగూ ఆయా గ్రామాలు తిరిగొస్తున్నాయి కాబట్టి, ఇప్పుడు కవిత రంగంలోకి దిగారు. తెలంగాణ జాగృతి డిమాండ్ కు దిగివచ్చి రాష్ట్ర ప్రభుత్వం అంటూ ట్వీట్ వేశారు కవిత.