
TS Crime : హైదరాబాద్ నగరంలోని చంపాపేటలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. అదే బిల్డింగ్ లో ఉంటున్న యువకుడు.. రెండవ అంతస్తు నుంచి పడిపోయిన యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంపాపేట రాజీ రెడ్డి నగర్ లో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన హనుమంతు, స్వప్న అనే ఇద్దరు ఓ రూమ్ ను అద్దెకు తీసుకుని ఉంటూ ఉద్యోగ అన్వేషణ చేస్తున్నారు. ఇల్లు అద్దెకు తీసుకునేటపుడు తామిద్దరం అన్నాచెల్లెళ్లమని చెప్పినట్లు ఇంటి యజమాని తెలిపారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు స్వప్న ఉంటున్న గదిలోకి చొరబడి.. ఆమెను హత్యచేసి పారిపోతుండగా ఇంటి యజమాని చూసి కేకలు పెట్టారు.
అదే సమయంలో.. హన్మంత్ అనే యువకుడు రెండవ అంతస్తు నుంచి కిందపడిపోయాడు. అతను ప్రమాదవశాత్తు పడిపోయాడా? లేక ఎవరైనా తోసేశారా ? ఆత్మహత్యాయత్నమా ? అన్న విషయం ప్రశ్నార్థకంగా ఉంది. ఒకే బిల్డింగ్ లో రెండు ఘటనలు జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. తీవ్రగాయాలతో ఉన్న హన్మంత్ ను ఆసుపత్రికి తరలించారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన యువతికి, భవనం పై నుండి కిందపడి ప్రాణాపాయ స్థితిలో ఉండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడికి, పారిపోయిన వారికి గల సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
తాజాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. తాము అన్నాచెల్లెళ్లమని చెప్పిన స్వప్న-హన్మంత్ లకు నెలరోజుల క్రితం పెళ్లైనట్లు పోలీసులు తెలిపారు. వారిద్దరి తీరు అనుమానంగా ఉండటంతో రెండు నెలల క్రితమే ఇల్లు ఖాళీచేయాలని చెప్పామని ఇంటి యజమాని చెప్పారు. కాగా.. స్వప్నను హత్యచేసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు పారిపోతున్న దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వగా.. పోలీసులు వాటిని పరిశీలిస్తున్నారు. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తీవ్రగాయాలపాలైన హన్మంత్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. స్వప్నస్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా కొత్తపేటగా గుర్తించారు. ఆమె తల్లిదండ్రులు కొంతకాలంగా విడివిడిగా ఉంటుండగా.. తండ్రి హైదరాబాద్ లోనే ఆటో నడుపుతున్నట్లు తెలుస్తోంది.
Munugode : “ఊరకుక్కలు, పిచ్చికుక్కలు”.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..