TSRTC sending Rakhis through Cargo service to all states: మహాలక్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న టీఎస్ ఆర్టీసీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే తెలంగాణ ఆడపడుచులకు ఓ శుభవార్తను అందించింది. రాఖీ పండుగ పురస్కరించుకుని దూర ప్రాంతాలలో ఉండే సోదరుల కోసం రక్షాబంధన్ రాఖీలను తెలంగాణ ఆర్టీసీ తన కార్గో సేవల ద్వారా అందించేందుకు సిద్ధమయింది. ఏ ప్రాంతంలో ఉన్నా సోదరీసోదరులకు రాఖీలు 24 గంటలలో అందజేసే విధంగా కార్యాచరణ రూపొందించింది. ఇంకా నాలుగురోజుల సమయం ఉండటంతో ఇప్పటినుంచే తెలంగాణ ఆర్టీసీ బస్టాండ్ లలో ఉన్న కార్గో సర్వీస్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఛార్జీల విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఎంత వసూలు చేస్తారనేది దూరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు.
గిఫ్ట్ లు, స్వీట్ బాక్సులు
రాఖీలతో బాటు గిఫ్ట్ లు, స్వీట్ బాక్సులు, పూల బొకేలు ఇలా ఏవైనా సరే కార్గో ద్వారా అందజేయనున్నారు. గత సమ్మర్ లో కూడా ప్యాక్ చేసిన పచ్చళ్లను కార్గో సేవల ద్వారా పంపించారు. కేవలం తెలంగాణ ప్రాంతానికే కాకుండా పొరుగు రాష్ట్రాలకు కూడా ఈ కార్గో ద్వారా సేవలు పొందవచ్చు. ఆర్టీసీలో కొరియర్ సర్వీసుల ద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరుతుంది. ఏది ఏమైనా రక్షాబంధన్ పండుగకు రాఖీలను పంపించుకునే ఏర్పాట్లు చేసినందుకు టీఎస్ ఆర్టీసీకి సర్వత్రా అభినందనలు అందుతున్నాయి.