బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఛత్తీస్‌గఢ్ సీఎంతో మంత్రి ఉత్తమ్ భేటీ.. సమ్మక్క-సారక్క ప్రాజెక్టుపై చర్చ

ఛత్తీస్‌గఢ్ సీఎంతో మంత్రి ఉత్తమ్ భేటీ.. సమ్మక్క-సారక్క ప్రాజెక్టుపై చర్చ

Uttam Kumar: స్వేచ్ఛ బ్యూరో: గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన సమ్మక్క–సారక్క బ్యారేజ్ అనుమతుల సాధనలో మరో కీలక ముందడుగు పడిందని మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌కు గురువారం రాత్రి వచ్చిన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి తో పార్క్ హయత్‌లో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారుల బృందంతో కలిసి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఛత్తీస్‌గఢ్–తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన సమ్మక్క–సారక్క ప్రాజెక్టుపై సుదీర్ఘంగా చర్చించారు.

ఛత్తీస్‌గఢ్ సీఎంకు తెలంగాణ విజ్ఞప్తి

ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం తుది పరిశీలనకు తీసుకెళ్లేందుకు అవసరమైన అభ్యంతర రహిత పత్రం, ఎన్ఓసీ జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున విజ్ఞాపన పత్రాన్ని ఛత్తీస్‌గఢ్ సీఎంకు అందజేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి జలాల వినియోగం, పెండింగ్ నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తి, రైతాంగానికి శాశ్వత సాగునీటి భద్రత కల్పించడం వంటి అంశాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని ఉత్తమ్ తెలిపారు.

సమ్మక్క–సారక్క బ్యారేజ్

సమ్మక్క–సారక్క బ్యారేజ్ తెలంగాణ రైతాంగానికి అత్యంత కీలకమైన ప్రాజెక్టు అని వివరించారు. ఛత్తీస్‌గఢ్ సీఎం తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారని, అంశాన్ని సానుభూతితో పరిశీలిస్తామని హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు. ఈ పరిణామం సమ్మక్క–సారక్క ప్రాజెక్టు అనుమతుల ప్రక్రియలో కీలక మలుపుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

మరింత ఖచ్చిత సర్వేకు ఛత్తీస్‌గఢ్ కోరిక

కేంద్ర జల సంఘంలోని అంతర్‌రాష్ట్ర వ్యవహారాల డైరెక్టరేట్ మినహా మిగతా అన్ని ప్రధాన డైరెక్టరేట్ల నుంచి ప్రాజెక్టుకు ఇప్పటికే అనుమతులు లభించాయని ఉత్తమ్ వెల్లడించారు. ఎన్ఓసీ లేకపోవడం వల్ల మాత్రమే డీపీఆర్ తుది పరిశీలన నిలిచిపోయిన విషయాన్ని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రాజెక్టు ముంపు, బ్యాక్‌వాటర్ ప్రభావిత ప్రాంతాలపై ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు ఇప్పటికే సంయుక్త సర్వే నిర్వహించారని మంత్రి తెలిపారు. మరింత ఖచ్చితమైన సర్వే కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కోరిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందించిందన్నారు.

సర్వే కోసం రూ.9.883 కోట్లు

సర్వే ఖర్చుల కోసం రూ.9.883 కోట్లను 2026 ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్ జలవనరుల శాఖకు విడుదల చేసినట్లు వివరించారు. ప్రస్తుతం బీజాపూర్ జిల్లాలో సర్వే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ముంపు లేదా బ్యాక్‌వాటర్ ప్రభావిత భూములు గుర్తించిన పక్షంలో చట్టబద్ధంగా పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అవసరమైతే పరిహార మొత్తాన్ని ముందుగానే డిపాజిట్ చేసేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

సమ్మక్క–సారక్క ప్రాజెక్టుపై కీలక వివరాలు

సమ్మక్క–సారక్క ప్రాజెక్టు మూలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పీవీ నరసింహారావు కంఠనపల్లి సుజల స్రవంతి పథకంలో ఉన్నాయన్నారు.గోదావరి నదిపై కంఠనపల్లి వద్ద బ్యారేజ్ నిర్మించి ఎస్సార్ఎస్పీ స్టేజ్–2 ఆయకట్టును స్థిరీకరించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టు రూపొందించబడిందన్నారు. 2009 ఫిబ్రవరి 10న జారీ చేసిన జీఓ ఎంఎస్ నెం.27 ద్వారా ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతి లభించిందని, 2012 మార్చి 2న కేంద్ర జల సంఘం డీపీఆర్ తయారీకి సూత్రప్రాయ అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు.

Also Read: కేశినేని బ్రదర్స్ ‘ఈడీ’ వార్.. అన్న వేసిన ప్లాన్‌కు తమ్ముడు డిఫెన్స్‌లో పడతాడా?

గోదావరి నుంచి 46.96 టీఎంసీల నీటి మళ్లింపు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటిపారుదల రంగ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రాజెక్టును పునఃరూపకల్పన చేశారని మంత్రి తెలిపారు. సాంకేతిక అధ్యయనాల అనంతరం బ్యారేజ్‌ను ములుగు జిల్లాలోని తూపాకులగూడెం వద్ద నిర్మించడం సాంకేతికంగా, ఆర్థికంగా మరింత ప్రయోజనకరమని తేలిందన్నారు. ఈ మార్పుతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ముంపు ప్రభావం గణనీయంగా తగ్గిందని వివరించారు.సమ్మక్క–సారక్క బ్యారేజ్ ద్వారా గోదావరి నుంచి 46.96 టీఎంసీల నీటిని మళ్లించి ఎస్సార్ఎస్పీ స్టేజ్–2 కింద 4.40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నట్లు మంత్రి తెలిపారు.

30 వేల ఎకరాలకు కొత్త సాగునీరు

రామప్ప–పాకాల లింక్ కాలువ ద్వారా మరో 30 వేల ఎకరాలకు కొత్తగా సాగునీటి సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు.ఈ ప్రాజెక్టు ద్వారా సూర్యాపేట జిల్లాలో 2,34,199 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 96,494 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 85,774 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 22,422 ఎకరాలు, జనగామ జిల్లాలో 1,111 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ప్రయోజనం కలుగుతుందని ఆయన తెలిపారు. రామప్ప–పాకాల లింక్ కాలువ ద్వారా ములుగు జిల్లాలో 8,000 ఎకరాలు, వరంగల్ నర్సంపేట ప్రాంతంలో 22,000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు.ఇదే కాకుండా జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకంలోని కొంత ఆయకట్టు స్థిరీకరణకు కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.

2021 నుంచి డీపీఆర్ పురోగతిపై కీలక పరిణామాలు

ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని వందలాది గ్రామాలకు తాగునీటి ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.ప్రాజెక్టు డీపీఆర్‌ను 2021 ఆగస్టు 31న కేంద్ర జల సంఘానికి సమర్పించినట్లు తెలిపారు. హైడ్రాలజీ డైరెక్టరేట్, కాస్ట్ ఎస్టిమేట్స్ డైరెక్టరేట్, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కేంద్ర భూగర్భ జల మండలి సహా పలు ప్రధాన అనుమతులు ఇప్పటికే లభించాయని చెప్పారు. 2024 జూలై నుంచి 2026 జనవరి వరకు కేంద్ర జల సంఘం కోరిన వివరణలన్నింటికీ తెలంగాణ నీటిపారుదల శాఖ సమగ్ర సమాధానాలు సమర్పించిందన్నారు. ఎన్ఓసీ సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం గత రెండేళ్లుగా నిరంతరంగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. 2024 ఏప్రిల్ 26, ఆగస్టు 12, 2025 జనవరి 24, ఏప్రిల్ 23 తేదీల్లో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి అధికారిక లేఖలు రాసినట్లు తెలిపారు. 2025 సెప్టెంబర్ 22న రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు గుర్తు చేశారు.

Also Read: క్రికెట్ పిచ్‌పై మల్లారెడ్డి మాస్ బ్యాటింగ్.. మేడ్చల్‌లో సీఎంఆర్ స్కూల్స్ షురూ!

కేంద్రానికి ప్రత్యేక విజ్ఞప్తులు

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ తో, కేంద్ర జల సంఘం చైర్మన్‌తో కూడా ఈ అంశంపై చర్చలు జరిపినట్లు మంత్రి తెలిపారు. 2025 నవంబర్, డిసెంబర్ నెలల్లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ప్రత్యేక విజ్ఞప్తులు పంపి అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్లు వివరించారు.ప్రస్తుతం సర్వే పనులు కొనసాగుతుండటం, తెలంగాణ ప్రభుత్వం అవసరమైన నిధులు విడుదల చేయడం, ముంపు ప్రభావితులకు నష్టపరిహారం చెల్లించేందుకు ముందుకు రావడం, రెండు రాష్ట్రాల మధ్య సానుకూల వాతావరణం నెలకొనడం వల్ల ఎన్ఓసీ త్వరలోనే లభించే అవకాశాలు మెరుగయ్యాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

చివరి అడ్డంకి తొలగే అవకాశం

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఎన్ఓసీ జారీ చేసిన వెంటనే కేంద్ర జల సంఘం అంతర్‌రాష్ట్ర వ్యవహారాల డైరెక్టరేట్ డీపీఆర్ తుది పరిశీలన పూర్తి చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దీంతో సమ్మక్క–సారక్క బ్యారేజ్ అమలుకు ఉన్న చివరి ప్రధాన పరిపాలనా అడ్డంకి కూడా తొలగిపోయే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.రైతుల ప్రయోజనాలు, సాగునీటి భద్రత, తాగునీటి అవసరాలు, అంతర్‌రాష్ట్ర సత్సంబంధాలు — ఈ నాలుగు అంశాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క–సారక్క ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోందని ఉత్తమ్ అన్నారు.

Also Read: ఎవరి కోసం, ఏ పైరవీల కోసం జీవోను ఆపారు? ప్రభుత్వాన్ని నిలదీసిన కవిత

Related News

హెల్త్ కార్డుల ఇష్యూపై వెనక్కి తగ్గేదే లేదు.. ప్రభుత్వానికి బీఆర్ఎస్ అల్టిమేటం!

‘సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చారు’.. కాంగ్రెస్‌పై హరీశ్ రావు ఫైర్

తెలంగాణను ‘గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్’గా మారుస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్ లేకపోతే సీజే.. రవాణా శాఖ సంచలన నిర్ణయం

తెలంగాణలో పవన్ పోటీ చేయెుచ్చు.. ఎప్పుడైనా రావొచ్చు, వెళ్లొచ్చు.. సీఎం రేవంత్ రెడ్డి

ఎవరి కోసం, ఏ పైరవీల కోసం జీవోను ఆపారు? ప్రభుత్వాన్ని నిలదీసిన కవిత

రాసిపెట్టుకోండి.. మళ్ళొచ్చేది కారే, కేసీఆర్ సర్కారే.. హరీశ్ రావు సవాల్

×