VH Hanumantha on Modi: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ కేసుతో ముడిపడి ఉన్న ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసందే. తాజాగా కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు.. పార్టీ ఓవర్సీస్ యూనిట్ చీఫ్ శ్యామ్ పిట్రోడా పేర్లను రాస్తూ.. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. దీనిపై ఈ నెల 25న ఢిల్లీ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టనుంది.
ఈనేపథ్యంలో హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. వీహెచ్ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఈడీ ఆఫీస్ ముందు బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వం ఈడీని అడ్డుపెట్టుకొని అక్రమ కేసులు పెడుతుందంటూ ఆందోళనకు దిగారు.
ఏజేఎల్, యంగ్ ఇండియన్ కంపెనీపై మనీ లాండరింగ్ కేసు
కాగా.. ఏజేఎల్, దాని యాజమాన్య కంపెనీ యంగ్ ఇండియన్ కంపెనీపై మనీ లాండరింగ్ కేసు ఇది. నేషనల్ హెరాల్డ్ కేసుగా ప్రచారంలో ఉంది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు పబ్లిషర్స్‌గా ఏజేఎల్ ఉండగా, యంగ్ ఇండియన్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి 38 శాతం చొప్పున మెజారిటీ షేర్లు ఉన్నాయి. కాంగ్రెస్‌కు ఏజేఎల్ బకాయి పడిన 90 కోట్లను వసూలు చేసుకునే విషయంలో యంగ్ ఇండియన్లో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో సోనియా, రాహుల్ లకు సంబంధమున్న ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు జారీ చేసింది.
రాహుల్, సోనియా కేసుపై కాంగ్రెస్ నేతలు ఫైర్
అయితే రాజకీయ కుట్రతోనే ఛార్జ్ షీట్‌లో రాహుల్, సోనియా పేర్లు చేర్చారంటూ మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. ప్రతిపక్షాలను వేధించడానికే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తున్నారన్నారు. నేషనల్ హెరాల్డ్ కంపెనీలో ఎలాంటి లావాదేవీలు చేసే అవకాశం లేకపోయినా కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు.
ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసిన ఈడీ
ఈ కేసులో సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేయడం ఇదే మొదటి సారి. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక భర్త, రాబర్ట్ వాద్రాను ఈడీ ప్రశ్నించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గుర్తించాల్సిన అంశం.
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో..
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ గతంలో పలుమార్లు విచారించింది. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి పోషించారన్న ఫిర్యాదుల మేరకు.. ఈడీ, సీబీఐ దర్యాప్తు చేశాయి. సీబీఐ విచారణ మధ్యలోనే నిలిచినప్పటికీ ఈడీ దర్యాప్తు మాత్రం.. కొనసాగుతూనే ఉంది.
AJLకు చెందిన రూ. 661 కోట్ల ఆస్తుల స్వాధీనం
అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కి సంబంధించి.. రూ. 661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు ప్రారంభించింది ఈడీ. ఇందులో భాగంగా నోటీసులు జారీ చేసింది. ఆయా ఆస్తుల్లో ఉంటున్న వారు ఖాళీ చేయాలని పేర్కొంది. అద్దెకు ఉంటున్నవారు ఇక నుంచి తమకే ఆ మొత్తాన్ని చెల్లించాలని తెలిపింది. అక్రమ చలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ 8 రూల్ నెంబర్ 5(1) ప్రకారం జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించామని అంటోంది ఈడీ. ఆస్తులున్న ప్రాంతాలైన ఢిల్లీ, ముంబై, లక్నో భవనాలకు నోటీసులు అంటించినట్టుగా తెలిపింది. తాజాగా ఢిల్లీ ప్రత్యేక కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ.. తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్టు చెప్పింది.
సోనియా, రాహుల్ పై ఛార్జ్ షీట్ దాఖలపై స్పందించిన ఎంపీలు
కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా, రాహుల్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేయడంపై ఆ పార్టీ ఎంపీలు స్పందించారు. ప్రతికారం కొద్దీ.. ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టడానికే బీజేపీ ప్రయత్నిస్తోందని మండి పడ్డారు. ఇలాంటి బెదిరింపులకు కాంగ్రెస్ భయపడదని వీరు అన్నారు.