కంచ గచ్చిబౌలి పరిధిలోని 400 ఎకరాల భూ వివాదంలో ఇటీవల ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మరాయి. అక్కడ భూమిని చదునుచేసే క్రమంలో నెమళ్లు, జింకలు పరుగులు తీశాయని, అవి జనావాసాల వద్దకు వచ్చాయంటూ కొన్ని వీడియోలు సర్కులేట్ అయ్యాయి. అయితే అవన్నీ ఫేక్ అని తేలింది. కొన్ని ఏఐతో చేసిన ఫొటోలు, వీడియోలు కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి. వాటిని సర్కులేట్ చేసినందుకు కొంతమంది పోలీస్ కేసులు కూడా ఎదుర్కోవడం విశేషం. వీటికి పరాకాష్టగా ఇప్పుడు మరో వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది. హైదరాబాద్ వీధుల్లో సింహం తిరుగాడుతుందంటూ ఓ వీడియోని కొంతమంది పోస్ట్ చేశారు. HCU భూముల నుంచి ఈ సింహం బయటకు వచ్చిందని, ఇటీవల బుల్డోజర్లు అటు వెళ్లగా వాటికి భయపడి అది రోడ్డుపైకి వచ్చిందని ఆ వీడియోతో పోస్టింగ్ లు పెట్టారు.
48సెకన్ల వీడియో..
హైదరాబాద్ రోడ్లపై సింహం అంటూ 48 సెకన్ల వీడియో వైరల్ గా మారడంతో చాలామంది దీనిపై ఆసక్తి చూపించారు. అసలు అది నిజమేనా, లేక ఫేక్ వీడియోనా అని ఎంక్వయిరీ మొదలు పెట్టారు. ఫ్యాక్ట్ చెక్ లో ఆ వీడియో నిజమే కానీ, అది హైదరాబాద్ కి సంబంధించిన వీడియో కాదని తేలింది. గుజరాత్ లో సింహం వీడియోని తీసుకొచ్చి హైదరాబాద్ HCU సింహంగా కొంతమంది చిత్రీకరించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గతంలో చిరుతలు కనిపించాయి కానీ, ఇక్కడి అటవీ భూముల్లో సింహాల సంచారం ఉన్నట్టు రికార్డులు కూడా లేవు. అలాంటిది హైదరాబాద్ వీధుల్లో సింహం అంటూ పోస్టింగ్ చేయడం మరింత హాస్యాస్పదంగా మారింది.
గుజరాత్ సింహాల గుంపు..
హైదరాబాద్ సింహంగా సర్కులేట్ అవుతున్న వీడియో.. గుజరాత్ కి సంబంధించినది. గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా రాజులా తాలూకాలోని కోవాయ గ్రామంలో జరిగిన సంఘటన అది. 2024 నవంబర్ లో 12 సింహాల గుంపు రోడ్డు దాటుతుండగా కొంతమంది దాన్ని వీడియో తీశారు. ఆ వీడియోని యథాతథంగా ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే అది హైదరాబాద్ అని పేర్కొనడం విశేషం. పూర్తి వీడియో చూస్తే అది ఫేక్ అనుకుంటారు కాబట్టి.. కొంతమంది ఫొటోలను తీసి అప్ లోడ్ చేశారు. హైదరాబాద్ వీధుల్లో సింహాన్ని చూడండి అంటూ కామెంట్ చేశారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి.. ఈ సింహాలు HCUలోని బుల్డోజర్లకు భయపడి ఎర్రవెల్లి ఫామ్ హౌస్, జన్వాడ ఫామ్ హౌస్ లో ఆశ్రయం కోసం పరిగెడుతున్నాయని సెటైర్లు పేల్చారు.
కంచ గచ్చిబౌలి భూముల్లో నెమళ్లు, జింకలు ఉన్న వీడియోలు పోస్ట్ చేస్తే మొదట్లో కొంతమంది నమ్మారు. ఆ తర్వాత అవి ఫేక్ వీడియోలు అని తేలడంతో ప్రతిపక్షాల కుట్రలు బయటపడ్డాయి. ఇప్పుడు ఏకంగా సింహాలు రోడ్లపైకి వచ్చాయని వీడియోలు పోస్ట్ చేయడం మరింత కామెడీగా మారింది. హైదరాబాద్ లో సింహాలేంటని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. జనాల్ని మరింతగా ఫూల్ చేయడానికి కొంతమంది ఈ వీడియోని వాడుకున్నారు.