VRA Jobs: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు పూర్తి కావొచ్చినా..ఇప్పటికీ వీఆర్ ఏ వారసత్వ ఉద్యోగాలపై క్లారిటీ రాలేదు. ఈ సమస్యను పరిష్కరించాలని బాధితులు రెండున్నర ఏళ్లుగా కోరుతున్నా..స్పందన కరవైంది. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చి నా..సమస్యను పరిష్కరించలేకపోయారు. దీంతో బాధితులు ఆలసిపోయారు. వీఆర్ ఏ వారసత్వ ఉద్యోగాలపై ప్రభుత్వం నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కమిటీల పేరిట కాలయాపన చేస్తూ తమకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని వీఆర్ ఏలు వాపోతున్నారు. జీవో నెంబరు 81 ప్రకారం తమకు ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సీఎం, రెవెన్యూ మంత్రి చొరవ తీసుకొని ఈ ప్రాసెస్ ను పూర్తి అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని వీఆర్ ఏ లు రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం వేగంగా స్పందించాలని ఆదివారం ఇందిరా పార్క్ వద్ద వీఆర్ ఏ వారసులు ధర్నా కార్యక్రమం చేపట్టనున్నారు.
వీఆర్ ఏ లకు పే స్కేల్, వారసులకు ప్రభుత్వం లో ఉద్యోగాలు కల్పిస్తామని గత సీఎం 2020లో హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత మాట నెరవేర్చలేదు. దీంతో వీఆర్ ఏలు ఐక్యమై జేఏసీగా ఏర్పడి 24 జూలై 2022 నుంచి అక్టోబరు 12 వరకు 80 రోజుల పాటు సుదీర్ఘ సమ్మె, ఛలో అసెంబ్లీ, రాస్తారోకో వంటి కార్యక్రమాలు చేశారు. వీఆర్ ఏ లంతా రోడెక్కడంతో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ హోదాలో న్యాయం చేస్తానని గతంలో హామీ ఇచ్చారు. అంతేగాక సీపీఎం, సీపీఐ, బీజేపీ, బీఎస్ పీ, జన సమితి తదితర పార్టీలతో పాటు ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు కూడా వీఆర్ ఏ ధర్నా పాయింట్లు, సభలకు చేరుకొని మద్ధతిచ్చాయి. దీన్ని గమనించిన గత ప్రభుత్వం జూలై 2023న జీవో 81,జీవో 85 ను విడుదల చేసింది. ఈ జీవోల ప్రకారం 20,555 మంది లో 16,758 మంది వీఆర్ ఏ లకు ప్రమోషన్లు కల్పిస్తూ, రెవెన్యూతో పాటు మున్సిపల్, మిషన్ భగీరథా, ఎడ్యుకేషన్, హెల్త్ , అగ్రికల్చర్, సోషల్ వెల్ఫేర్ శాఖల్లో సర్దుబాటు చేశారు. కానీ 61 ఏళ్లకు పై బడిన 3797 మంది కి వారసత్వ ఉద్యోగాలు కల్పించాల్సి ఉన్నా…ఇవ్వలేదు. ఇదే సమయంలో ప్రభుత్వం మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని భావించినప్పటికీ తమకు నిరాశే మిగిలిందని ఉద్యోగులు చెప్తున్నారు. నిజానికి 3797 ఉద్యోగుల్లో కొందరు తమ వారుసులను పది నుంచి పన్నేండేళ్లుగా వీఆర్ ఏలుగా పనిచేపిస్తూనే ఉన్నారు. ఇందులో కొందరు కంప్యూటర్ వర్క్, మరి కొందరు ఫీల్డ్ లెవల్ వర్క్ చేస్తున్నారు. డిగ్రీలు, పీజీలు చేసినోళ్లూ ఉన్నారు.
Also Read: Bus Accident: నేపాల్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ యాత్రికుల బస్సు, ఏడుగురు భారతీయులు మృతి
ఇక ఇప్పటికే ఆర్డర్ తీసుకొని ఇతర శాఖల్లో చేరినా ఎంప్లాయిస్ ను సతాయిస్తున్నట్లు బాధితులు చెప్తున్నారు. కొన్ని శాఖల్లో జీతాలు ఇవ్వకుండా సతాయిస్తున్నారని స్పష్టం చేస్తున్నారు.దీని వలన కుటుంబ పోషణ బారంగా మారుతుందని ఉద్యోగులు వివరిస్తున్నారు. ఇక ఇతర శాఖల్లో చేరినందున ఆయా హెచ్ వోడీలు సతాయింపు లు కూడా దారుణంగా ఉన్నాయని వివరిస్తున్నారు. ఉద్యోగాలు ఇస్తామని గతంలోనే ప్రభుత్వం చెప్పడంతో వారసత్వ ఉద్యోగాలు కోసం కుటుంబాల్లో ఆస్తులు పంపకాలు కూడా జరిగిపోయాయి. తండ్రుల స్థానంలో కుమారులకు ఈజీగా కారుణ్య నియమకంలో ఉద్యోగం వస్తుందని భావించారు.ఈ నేపథ్యంలో వీఆర్ ఏ కుమారుల మధ్య ఆస్తి పంపకాలు తదితర వాట పంపకాలు పూర్తయ్యాయి. కానీ ప్రభుత్వం నుంచి డీలే అవుతుండటంతో టెన్షన్ పడుతున్నారు. తమకు ఉద్యోగం వస్తుందా? లేదా? అని మదన పడుతున్నారు. పైగా 3797 మందిలో ఇప్పటికే సుమారు 300 మందికి పైనే మరణించినట్లు తెలుస్తున్నది.
Also Read: Ramchander Rao: కాంగ్రెస్ కావాలనే గ్యాస్ కొరత సృష్టిస్తుంది: రాంచందర్ రావు