Ramchander Rao: స్వేచ్ఛ బ్యూరో: గ్యాస్ కొరత ఎక్కడా లేదని, కాంగ్రెస్ కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడా గ్యాస్ కొరత లేదని, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లోనే గ్యాస్ కొరత సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) బాధ్యతా రాహిత్యంగా వాఖ్యలు చేస్తూ ప్రజల్లో ప్యానిక్ సృష్టిస్తున్నారని విరుచుకుపడ్డారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ కు చెందిన నేతలు పలువురు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అధ్యక్షతన బీజేపీలో చేరారు. అందులో ఫెడరేషన్ ఆఫ్ కాలనీస్ చైర్మన్ ఒంటేరు నర్సింహారెడ్డితో పాటు మరో 100 మంది కాషాయ పార్టీలో చేరారు. కాగా వారికి రాంచందర్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్లపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని, యుద్ధం వల్ల కొంత ఇబ్బంది కలగొచ్చని వ్యాఖ్యానించారు. ఇండియా తప్ప, యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని రాంచందర్ రావు(Ramchander Rao) తెలిపారు. నాడు మూసీకి రూ.5 వేల కోట్లు అన్నారని, నేడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) రూ.7 వేల కోట్లు అంటున్నారని మండిపడ్డారు. మూసీ క్లీన్ కావాల్సిందేనని, కానీ మూసీలో చేరే దుర్గంధాన్ని ఎలా నిలువరిస్తారని రాంచందర్ రావు ప్రశ్నించారు. గాంధీ విగ్రహం నిర్మాణానికి వందల ఎకరాలు కావాలా? అని నిలదీశారు. అందుకోసం ఇండ్లు కూల్చాలా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. సబర్మతి అభివృద్ధిని చూసి రేవంత్ రెడ్డి ఇన్ స్పైర్ అవ్వడం సంతోషంగా ఉందన్నారు. నాడు కేసీఆర్ హుస్సేన్ సాగర్ ను కొబ్బరి నీళ్లలా మారుస్తామని చెప్పి విస్మరించారని, కాంగ్రెస్ అయినా కొబ్బరి నీళ్లలా కాకుండా కనీసం తాగే నీళ్లనయినా అందించాలని చురకలంటించారు.
అనంతరం ఇగ సహించదు తెలంగాణ.. సేవ్ తెలంగాణ పేరిట రూపొందించిన పోస్టర్ ను రాంచందర్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేస్తున్న చేతకాని పాలనపై బీజేపీ పోరుబాటకు సిద్ధమవుతోందని పిలుపునిచ్చారు. పేదలకు ఇండ్లు ఇవ్వలేదని, పెన్షన్ కూడా ఇవ్వలేదన్నారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్ అంటూ కాంగ్రెస్ చెబుతోందని, కానీ కాంగ్రెస్ కు 999 రోజులు మాత్రమే మిగిలున్నాయని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ పై బీజేపీ పోరుబాటలో భాగంగా ఈనెల 16న మండల కేంద్రాల్లో కార్యకర్తలు ఎమ్మార్వోలకు వినతిపత్రాలు సమర్పిస్తారని, అదేవిధంగా మార్చి 20న జిల్లా కేంద్రాల్లో అన్ని కలెక్టరేట్ల ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. తదుపరి కార్యక్రమాలను త్వరలో ప్రకటిస్తామని రాంచందర్ రావు స్పష్టంచేశారు.
Also Read: Constable Controversy: కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం పై.. క్లారిటీ ఇచ్చిన సీపీ సజ్జనార్
పార్లమెంట్ లో రాహుల్ గాంధీ తీరును నిరసిస్తూ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఆయన దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి పార్లమెంట్ పిక్నిక్ స్పాట్ గా మారిందని విమర్శించారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని చురకలంటించారు. వాజ్ పేయి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి సహకరించారని గుర్తుచేశారు. అంతేకానీ పార్లమెంట్ మెట్ల ఎదుట ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేయలేదన్నారు. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా దానం నాగేందర్ అనర్హత పిటిషన్ స్పీకర్ తీర్పుపై బీజేపీ హైకోర్టుకు వెళ్లనుంది. సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లెలగూడలో మొత్తం బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ సున్నా అయిందని ఆయన వివరించారు. మీర్ పేట్, జిల్లెలగూడలో అసలు బీఆర్ఎస్ లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ విధానాలు అందరూ చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెట్టి మరేదో సబ్జెక్టు మాట్లాడుతున్నారని చురకలంటించారు. వారు పెట్టిన అవిశ్వాసంపై ఓటింగ్ జరగనివ్వలేదన్నారు. 400 ఓట్లు బీజేపీకి వస్తాయని, తమకు వంద ఓట్లు కూడా రావని కాంగ్రెస్ కు తెలుసు కాబట్టే ఇలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవాచేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ మెట్లపై కాళ్లమీద కాళ్లేసుకుని చాయ్ తాగుతున్నారని కొండా మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగిస్తుందని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.