Warangal Congress Politics: వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం బహిరంగంగా స్పందించింది. కొండా సురేఖను ఉద్దేశించి చిల్లర బ్యాచ్ అంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పీసీసీ మెంబర్ నల్గొండ రమేష్ ఘాటు కౌంటర్ ఇచ్చారు.
కొండా సురేఖ ప్రధాన అనుచరుడిగా ఉన్న నల్గొండ రమేష్, ఇటీవల ఎమ్మెల్సీ సారయ్య వర్గంలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేము పట్టిన జెండా విడవకుండా నలభై ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాం. అలాంటి సీనియర్లను చిల్లర గాళ్లంటూ సీనియర్ల మనోభావాలను దెబ్బతీసిన మాటలను ఖండిస్తున్నాం. అన్నారు.
చీమలు పెట్టిన పుట్టలో ఇప్పుడు పాములు చేరాయి అంటూ.. తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించిన నల్గొండ రమేష్, పార్టీని నిర్మించిన వారిని అవమానించేలా మాట్లాడటం ఏ మాత్రం సమంజసం కాదని అన్నారు.
పార్టీలు మారిన చరిత్రపై కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్‌సీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అంటూ పార్టీలు మారింది ఎవరో ముందుగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. పార్టీ మారిన వారు, పార్టీ కోసం ప్రాణాలు పెట్టిన వారిపై విమర్శలు చేయడం సరికాదు అని వ్యాఖ్యానించారు.
శాసనసభ ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తూ, ఎన్నికల్లో తేనేటి విందులు పెట్టి మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించింది మర్చిపోయారా? ఈ రోజు ఆ తేనేటి విందులే మింగుడు పడని విషంగా మారాయా? అంటూ తీవ్ర వ్యంగ్యంతో ప్రశ్నించారు. పార్టీ పరువును రోడ్డు మీదకు లాగుతూ చిల్లర పనులు చేసింది ఎవరో ప్రజలంతా గమనిస్తున్నారని హెచ్చరించారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన కార్పొరేటర్లను తర్వాత అక్కున చేర్చుకోవడాన్ని నల్గొండ రమేష్ తప్పుబట్టారు. ఎంపీ ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీకి ప్రజలు మెజార్టీ ఇచ్చారో అధిష్టానానికి స్పష్టంగా తెలుసు అని అన్నారు.
ఏ పార్టీకి వెళ్లి వచ్చినా, చివరికి కాంగ్రెస్ పార్టీ నుంచి మిమ్మల్ని గెలిపించిన ఘనత మా సీనియర్ నాయకులదే అంటూ ఆయన స్పష్టం చేశారు. అలాంటి సీనియర్లను చిల్లర గాళ్లుగా అభివర్ణించడం అన్యాయమని మండిపడ్డారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిస్థితిపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్లు ఎమ్మెల్యేను కలవాలంటే ఓ అనామకుడి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి రావడం కన్నా చిల్లర వేషం మరొకటి లేదు అని విమర్శించారు. ఓ మాజీ రౌడీషీటర్ చేతిలో వరంగల్ తూర్పు భవిష్యత్తును పెట్టారని ఆరోపించారు.
స్వపక్షం, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా అక్రమ కేసులు పెట్టిన ఘనత కూడా మీకే దక్కుతుందని ఆయన విమర్శించారు. పార్టీలో కార్యకర్త హోదా కూడా లేని వ్యక్తి దగ్గరికి కార్పొరేటర్లు, నాయకులు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారు.
Also Read: గాంధీ కుటుంబం గురించి మాట్లాడే హక్కు, అధికారం బీజేపీకి లేదు: జగ్గారెడ్డి
సీనియర్లను చిల్లర గాళ్లు అన్న మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేకపోతే పార్టీ శ్రేయస్సు కోసం మేము మరింత బలంగా పోరాడతాం అని నల్గొండ రమేష్ హెచ్చరించారు.