Hyderabad Weather: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. ముందస్తు రుతు పవనాలు ప్రభావం కనిపిస్తోంది. మంగళవారం రాత్రి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని వాతావరణ కేంద్రం తెలిపింది. అన్నట్లుగా హైదరాబాద్ నగరవాసులకు ఎండల నుంచి ఉపశమనం లభించింది. మంగళవారం అర్థరాత్రి నుంచి సిటీలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.
హైదరాబాద్ సిటీ ముసుగేసింది.. ముందస్తు రుతుపవనాల సంకేతాలు
ఎండల నుంచి హైదరాబాద్ నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. మంగళవారం రాత్రి సిటీలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ముఖ్యంగా కాప్రా, అల్వాల్, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, ఎల్బీ నగర్, మలక్‌పేట్, హయాత్‌నగర్ వంటి ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
అలాగే మేడ్చల్, జీడిమెట్ల, గాజుల రామారం, కుత్బుల్లాపూర్, అల్వాల్, నిజాంపేట్, బాచుపల్లి, కూకట్‌పల్లి, బాలానగర్, మల్కాజ్‌గిరి, బోయిన్‌పల్లి, సుచిత్ర, శేరిలింగంపల్లి ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన చేశారు. పైన చెప్పిన ప్రాంతాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షం పడుతుందని పేర్కొంది.
మరో గంటలో హైదరాబాద్ సిటీలో భారీ వర్షం
ఉరుములు మెరుపులకు తోడు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. వర్షం-గాలుల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో రాత్రంతా భారీ వర్షాలు, విస్తారంగా ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
పైన పేర్కొన్న జిల్లాల్లో ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఎడతెరిపి లేకుండా జల్లులు పడనున్నాయి. ఆ తర్వాత తగ్గుముఖం పట్టనున్నాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో రాబోయే గంట లేదా రెండుగంటలపాటు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని, ఆ తర్వాత తగ్గుతాయని పేర్కొంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ALSO READ: బాల్క సుమన్ వ్యాఖ్యలపై.. సామ రామ్మోహన్ రెడ్డి ఫైర్..!
ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో రాత్రి నుంచి వాతావరణ మారిపోయింది. వివిధ ప్రాంతాల్లో చినుకులు పడ్డాయి. రోడ్లు తడిచాయి. దీని ప్రభావం మరో గంట లేదా రెండు గంటలపాటు ఉంటుందని తెలిపింది. వర్షం తగ్గిన తర్వాత హైదరాబాద్ లో వాతావరణం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పొడిగా ఉంటుందని తెలిపింది. మొత్తానికి ముందస్తు రుతుపవనాలు ప్రభావం కొనసాగుతోందన్నమాట.