
PM Modi Warangal Speech Highlights(Latest political news telangana): ప్రధాని మోదీ వరంగల్ వచ్చారు. రోడ్డు, రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. విజయ సంకల్ప సభలో బీఆర్ఎస్, కేసీఆర్‌లపై విరుచుకుపడ్డారు. ఇప్పటికే ట్రైలర్ చూపించామని.. వచ్చే ఎన్నికల్లో తుడిచిపెట్టేస్తామంటూ హెచ్చరించారు. ఢిల్లీ వరకూ అవినీతి పాకిందంటూ.. కవితపైనా అటాక్ చేశారు.
బీఆర్ఎస్‌పై ఇంతగా రెచ్చిపోయిన మోదీ.. కాంగ్రెస్ పార్టీకి మాత్రం పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆ రెండు పార్టీలంటూ ఓసారి.. గ్యారెంటీ హామీలంటూ పరోక్షంగా మరోసారి.. అంతే.. అలా రెండు మూడు పదాలకే పరిమితమయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో జోరు మీదున్న కాంగ్రెస్ పార్టీని కానీ, ఇటీవల జరిగిన రాహుల్ గాంధీ సభపై కానీ, రేవంత్ రెడ్డి దూకుడు మీద కానీ.. అస్సలు మాట్లాడకపోవడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఎందుకు? మోదీ ఎందుకు కాంగ్రెస్‌ను టార్గెట్ చేయలేదు?
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. గద్దె దింపాల్సింది కేసీఆర్‌నే. అందుకే కాంగ్రెస్‌ను పట్టించుకోలేదని అనుకోలేం. ఎందుకంటే.. కర్నాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని పట్టించుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి బీజేపీది. కర్నాటకకు తెలంగాణకు దగ్గరి పోలికలు ఉన్నాయి. అక్కడలానే ఇక్కడా కాంగ్రెస్ బలంగా ఉంది. ప్రస్తుతం రాహుల్ మేనియా నడుస్తోంది. హస్తం పార్టీ సభలు.. బీజేపీ సభలకంటే గ్రాండ్ సక్సెస్ అవుతున్నాయి. రాహుల్ గాంధీ హాజరైన ఇటీవలి ఖమ్మం సభ ఎలా జరిగిందో.. దేశ ప్రధాని మోడీ విచ్చేసిన వరంగల్ సభ ఎంత సాదాసీదాగా జరిగిందో.. అంతా చూశారు. కాంగ్రెస్ బల ప్రదర్శన ముందు.. కమల బలగం కంటికి ఆనడం లేదంటున్నారు.
ఇక, కాంగ్రెస్ ప్రస్తావన తీసుకొచ్చి.. ఆ పార్టీకి మరింత ప్రచారం, ప్రాధాన్యం కల్పించడం ఎందుకనేది మోదీ వ్యూహం అని కూడా అంటున్నారు. ఆ పార్టీ గురించి మాట్లాడి.. కాంగ్రెస్‌ను సైతం బీజేపీకి పోటీదారుగా నిలపడం ఇష్టం లేకనే అంటున్నారు. తమకు బీఆర్ఎస్‌తోనే పోటీ.. కాంగ్రెస్‌తో కాదనేలా ప్రజల్లోకి మెసేజ్ పంపించారని భావిస్తున్నారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీపై లోలోన భయం వెంటాడుతున్నా.. పైపైకి పట్టించుకోనట్టు ఉంటూ.. లేనిపోని గాంభీర్యం ప్రదర్శిస్తున్నారనే వాదనా ఉంది. మరోవైపు, బీఆర్ఎస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగంగానే.. వాళ్లను వీళ్లు, వీళ్లను వాళ్లు తిట్టుకుంటూ.. రాజకీయ రణక్షేత్రంలో వాళ్లిద్దరే ఉండేలా జాగ్రత్త పడుతున్నారని విశ్లేషిస్తున్నారు. అందుకే, మోదీ నోట కాంగ్రెస్ పేరు రాలేదా?
Mallareddy IT Raids Updates : ఎర్రకోటపై బీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయం : మంత్రి మల్లారెడ్డి