Wildness Resort: వికారాబాద్ జిల్లా గోదాంగూడ గ్రామంలో ఏర్పాటైన.. ది వైల్డర్‌నెస్ రిసార్ట్ తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. తాజాగా ఈ రిసార్ట్ యాజమాన్యం అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రైతులను మోసం చేసి అసైన్డ్ భూములు కొనుగోలు చేయడం, ప్రభుత్వ భూములను ఆక్రమించడం, చెరువులో గదులు నిర్మించడం వంటి ఆరోపణలు ఉన్నాయి.
రైతులను మభ్యపెట్టి భూములు కొనేసిన యాజమాన్యం
అందిన సమాచారం ప్రకారం.. రిసార్ట్ యాజమాన్యం స్థానిక రైతులను “ఆర్గానిక్ ఫార్మింగ్” పేరుతో మభ్యపెట్టి.. అసైన్డ్ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసింది. మీ భూముల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తాం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడతాం అంటూ మాటలతో మాయ చేసి.. దాదాపు 18 ఎకరాల భూమిని సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ భూముల్లో కొన్ని ప్రభుత్వానికి చెందిన అసైన్డ్ భూములే కావడం గమనార్హం.
సర్వే నంబర్ 92లో 5 ఎకరాల అక్రమ ఆక్రమణ
సర్వే నంబర్ 92 ప్రాంతంలోని 5 ఎకరాల భూమిని.. రిసార్ట్ యాజమాన్యం అక్రమంగా కబ్జా చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ భూమిపై ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా నిర్మాణాలు చేపట్టినట్లు సమాచారం. కాబట్టి ఇది పూర్తిగా ప్రభుత్వ పాలసీకి విరుద్ధమని, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
చెరువులో గదుల నిర్మాణం
రిసార్ట్ నిర్మాణాల్లో వాస్తవానికి అన్నిటికంటే వివాదాస్పదం.. చెరువులో నిర్మించిన గదుల వ్యవహారం. గ్రామానికి చెందిన ప్రజలకు అవసరమైన నీటి వనరు అయిన ఈ చెరువు, ఇప్పుడు రిసార్ట్ కోసం ఆక్రమించారు. చెరువు మధ్యలో గదులు నిర్మించి వాటిని లగ్జరీ వాటర్ విలాస్‌గా ప్రమోట్ చేస్తున్నట్లు సమాచారం.
మీడియా ప్రతినిధిపై దౌర్జన్యం
ఈ అక్రమాలను కవర్ చేసేందుకు వెళ్లిన బిగ్ టీవీ చానల్ ప్రతినిధిపై.. రిసార్ట్ సిబ్బంది దౌర్జన్యానికి దిగారు. వీడియోలు తీస్తున్న జర్నలిస్టుపై రెచ్చిపోయిన వారు, తాము పెంచుకున్న కుక్కను ఉసిగొల్పిన దారుణ ఘటన.. తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మీడియా స్వేచ్ఛను హరించే విధంగా ప్రవర్తించిన రిసార్ట్ యాజమాన్యం.. చర్యలకు పాల్పడిందని జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. దీనిపై విపక్షాలు కూడా స్పందిస్తూ.. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు?
ఇంత వివాదాస్పద అంశాల మధ్య, స్థానిక రెవెన్యూ, గ్రామపంచాయతీ, మునిసిపల్, వన్యప్రాణుల సంరక్షణ శాఖలు మాత్రం.. ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను విక్రయించడం ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టవిరుద్ధమైతే, వాటిపై నిర్మాణాలు చేపట్టడం ఇంకా తీవ్రమైన నేరం. అయినప్పటికీ అధికార యంత్రాంగం మౌనంగా వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
ప్రజల్లో ఆగ్రహం, చర్యలకై డిమాండ్
ఈ ఘటనలపై స్థానిక ప్రజలు, రైతు సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ప్రజలకు దక్కాల్సిన భూములు, నీటి వనరులు కొందరు కార్పొరేట్ లాభాల కోసమే.. ఉపయోగించుకుంటున్నారని మండిపడుతున్నారు. ది వైల్డర్‌నెస్ రిసార్ట్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ భూములను తిరిగి ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో, సంబంధిత శాఖల సమగ్ర విచారణ అవసరమైంది. అధికారుల మౌనంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఈ అంశంపై త్వరగా స్పందిస్తే తప్ప, న్యాయం జరగదు అనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది.
మరోవైపు వికారాబాద్‌లో ది వైల్డర్‌నెస్ రిసార్ట్‌లో ఇద్దరు చనిపోయిన ఘటనపై కేసు నమోదు చేయడంలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఎఫ్.ఐ.ఆర్‌ని చూస్తే అర్థమవుతోంది. ఘటనపై BNS 106(1) కింద పోలీసులు నామమాత్రపు సెక్షన్ పెట్టారు. తెలియని నిర్లక్ష్యం కారణంగా చనిపోయినట్లు పేర్కొన్నారు.
Also Read: ఢిల్లీకి సీఎం రేవంత్.. టూర్ షెడ్యూల్ ఇదే!
అనుమతులు లేకుండానే రిసార్ట్ నిర్వాహకులు బోటింగ్‌కు అనుమతించడం తప్పని పోలీసులకు తెలియదా? లైఫ్ జాకెట్లు ఇవ్వకుండా పంపిస్తే ప్రమాదమని రిసార్ట్ నిర్వాహకులకు తెలియదా? ప్రాణాలకు ప్రమాదమని తెలిసీ పర్యాటకులను పంపించిన వాళ్లను ఏం చేయాలి? కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కేస్ ఎందుకు పెట్టలేదు? BNS 105 సెక్షన్ కింద FIRను ఎందుకు నమోదు చేయలేదు? ఎఫ్‌ఐఆర్‌ని చూస్తే ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాదు.. నిందితుని పేరే లేకుండా FIR నమోదు చేశారు… పోలీసులు. ఎవరి నిర్లక్ష్యం వల్ల చనిపోయారో FIRలో నమోదు చేయకపోవడంతో.. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.