భరత్ చంద్ర చారి. తెలంగాణలో విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఆ విద్యార్థికి 73శాతం మార్కులు వచ్చాయి. అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చినవారు కూడా ఉన్నారు కానీ, ఆ విద్యార్థి మాత్రం సంథింగ్ స్పెషల్. అందుకే నేరుగా జిల్లా కలెక్టర్ ఫోన్ చేసి ఆ అబ్బాయికి కంగ్రాట్స్ చెప్పారు. మంచి పర్సంటేజ్ తో పాసయ్యావంటూ అభినందించారు. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయాలని సూచించారు.
కలెక్టర్ ఫోన్ కాల్..
పదో తరగతి ఫలితాలు రాగానే.. కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఎవరైనా పది పరీక్షలు రాసిన వారు ఉన్నారా అని చాలామంది ఆలోచిస్తారు, వారి మార్కులు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాత్రం నారాయణపూర్ మండలంలోని కంకణాల గూడెంకు చెందిన భరత్ చంద్ర చారి అనే అబ్బాయి రిజల్ట్ తెలుసుకున్నారు. ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆ అబ్బాయిని కుటుంబ సభ్యుల్ని అభినందించారు. కలెక్టర్ ప్రత్యేకంగా ఎందుకు చొరవ తీసుకుని ఫోన్ చేశారనడానికి మరో కారణం ఉంది. నిరుపేద కుటుంబానికి చెందిన భరత్ చంద్ర చారికి కలెక్టర్ హనుమంతరావు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చారు. పది పరీక్షలు బాగా రాయాలంటూ మోటివేషన్ ఇచ్చారు. చివరకు ఆ విద్యార్థి మంచి మార్కులు తెచ్చుకోవడంతో కలెక్టర్ హ్యాపీగా ఫీలయ్యారు. ఆ అబ్బాయిని ఫోన్ లో అభినందించారు. త్వరలో ఇంటికి వచ్చి మరీ సన్మానం చేస్తానని చెప్పారాయన. అతని తల్లి విజయలక్ష్మిని కూడా ఫోన్ లో అభినందించారు కలెక్టర్.
ఎవరీ భరత్ చంద్ర చారి..?
యాదాద్రి భువనగిరి జిల్లా కంకణాల గూడెంకు చెందిన ఓ నిరుపేద విద్యార్థి భరత్ చంద్ర చారి. తల్లి విజయలక్ష్మి ప్రోత్సాహంతో చదువుకుంటున్నాడు భరత్. ఒకరోజు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆ ఇంటికి వచ్చారు. పదో తరగతి పరీక్షలు దగ్గరపడిన సమయంలో విద్యార్థుల్లో పరీక్షల పట్ల బెరుకు పోగొట్టేందుకు, వారిని మోటివేట్ చేసేందుకు కలెక్టర్ ఓ కార్యక్రమం చేపట్టారు. Knocking on Doors – పదో తరగతి విద్యార్థుల ఇంటి తలుపు తట్టే కార్యక్రమం మొదలు పెట్టారు. ఒక రోజు ఉదయం 5 గంటలకే భరత్ చంద్ర చారి ఇంటికి వెళ్లి తలుపు తట్టారు, ఇంట్లో చదువుకుంటున్న ఆ పిల్లవాడి వద్దకు వెళ్లి పరీక్ష సన్నద్ధత గురించి ఆరా తీశారు. అక్కడితో ఆగిపోలేదు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న కలెక్టర్ ఆ విద్యార్థికి రైటింగ్ ప్యాడ్, కుర్చీ తీసిచ్చారు. 5వేల రూపాయలు ఖర్చులకు ఇచ్చారు. చక్కగా చదువుకోవాలని, మంచి మార్కులతో పాస్ కావాలని సూచించారు.
ఆయన శ్రమ వృథా పోలేదు..
జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రోత్సాహం భరత్ చంద్ర చారిలో మరింత కసి పెంచింది. భరత్ పాస్ అవుతాడని తల్లికి తెలుసు అయితే ఫస్ట్ క్లాస్ వరకు మార్కులు వస్తాయని వారు అంచనా వేశారు. కానీ అతడి కష్టం ఫలించి 73శాతం మార్కులు వచ్చాయి. కలెక్టర్ హనుమంతరావు ప్రోత్సాహం వల్లే తాను మరింత కష్టపడి చదివానని, మంచి మార్కులు తెచ్చుకున్నానని చెబుతున్నాడు భరత్ చంద్ర చారి.