Himalayan Rail Connectivity: దేశంలో రైల్వే కనెక్టివిటీని మరింతగా విస్తరించేందుకు కేంద్రం కీలక చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో రైల్వే మార్గాల నిర్మాణం ఇంజినీర్లకు పెద్ద సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్లో చేపట్టిన 125 కిలోమీటర్ల రిషికేశ్–కర్ణప్రయాగ్ రైల్వే ప్రాజెక్ట్ దేశంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోబోతోంది. ఈ మార్గంలో 16 ప్రధాన సొరంగాలు, 19 వంతెనలను నిర్మిస్తున్నారు. మరోవైపు, ఇలాంటి భారీ ప్రాజెక్టులకు అవసరమైన టన్నెల్ బోరింగ్ మెషీన్లను దేశీయంగానే తయారు చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోంది.
రిషికేశ్–కర్ణప్రయాగ్ రైల్వే లైన్ ఉత్తరాఖండ్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనుంది. మొత్తం 125 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో సుమారు 83 శాతం దూరం సొరంగాల గుండా కొనసాగనుంది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన రైలు ప్రయాణాన్ని అందించడంతో పాటు, పర్వత ప్రాంతాలను అనుసంధానించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ మార్గంలో 12 స్టేషన్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. తాజాగా రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని వివరిస్తూ, హిమాలయాల్లో ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం అధునాతన ఇంజినీరింగ్ సామర్థ్యాలకు నిదర్శనంగా అభివర్ణించారు.
హిమాలయ పర్వత ప్రాంతాల్లో భూమి స్వభావం మారుతూ ఉంటుంది. పర్వతాల్లో తవ్వకాలు జరిపిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో నేల లోపలికి కుంగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు సొరంగాల నిర్మాణాన్ని మరింత క్లిష్టంగా మారుస్తాయి. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు రిషికేశ్–కర్ణప్రయాగ్ ప్రాజెక్టులో ఉపయోగించే టన్నెల్ బోరింగ్ మెషీన్లలో ప్రత్యేక మార్పులు చేసినట్లు మంత్రి తెలిపారు. కట్టర్ హెడ్, షీల్డ్ లలో సర్దుబాట్లు చేయడంతో పాటు, హైటార్క్, థ్రస్ట్ అందించేలా డ్రైవ్ వ్యవస్థలను రూపొందించారు. దీనివల్ల కఠినమైన భూభాగాల్లో తవ్వకాలు చేపట్టేందుకు అవసరమైన సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేశారు.
గతంలో భారీ సొరంగ నిర్మాణ పనుల కోసం భారత్ ఎక్కువగా విదేశాల నుంచి టన్నెల్ బోరింగ్ మెషీన్లను దిగుమతి చేసుకునేది. అయితే, ఇప్పుడు ఈ రంగంలో దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంచుతోంది. ప్రస్తుతం 8 మీటర్ల వ్యాసం కలిగిన టీబీఎంలను భారత్ లోనే తయారు చేస్తున్నామని, 15 మీటర్ల వ్యాసం గల యంత్రాల తయారీ కూడా ప్రారంభమైందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తమిళనాడులో టీబీఎం తయారీ ప్లాంట్ ఉండగా, భవిష్యత్తులో 16 మీటర్లకు మించిన వ్యాసం కలిగిన యంత్రాలను కూడా దేశీయంగా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రిషికేశ్–కర్ణప్రయాగ్ రైల్వే లైన్ పూర్తయితే కర్ణప్రయాగ్, రుద్రప్రయాగ్ లాంటి ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ మెరుగుపడుతుందని భావిస్తున్నారు. కేదార్నాథ్, బద్రీనాథ్ లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా అనుసంధాన సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉంది. కర్ణప్రయాగ్ భారత్–చైనా సరిహద్దుకు సుమారు 123 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఈ ప్రాజెక్టుకు వ్యూహాత్మక ప్రాధాన్యం కూడా ఉంది.
Read Also: 6 రాష్ట్రాల మీదుగా 4,188 కి.మీ ప్రయాణం.. దేశంలో లాంగెస్ట్ ట్రైన్ జర్నీ ఇదే!