Municipal Bribery: ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాల్సిన మున్సిపల్ పాలనలో మామూళ్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు మంజూరు చేయాల్సిన అధికారులు.. పనుల పర్యవేక్షణ చేయాల్సిన సిబ్బంది తమ విధులకు పరిమితం కావాల్సి ఉండగా, అనుమతుల పేరుతో డబ్బుల బేరసారాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని నూతనకల్ వార్డు అధికారికి సంబంధించినదిగా ప్రచారంలోకి వచ్చిన ఓ సంభాషణ ఇప్పుడు మున్సిపల్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
మున్సిపల్ పరిధిలో ఏదైనా నిర్మాణం చేపట్టాలన్నా, వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలన్నా సంబంధిత శాఖల అనుమతులు తప్పనిసరి. అయితే ఇప్పటికే అన్ని అనుమతులు ఉన్నాయని చెబుతున్న సందర్భంలోనూ డబ్బుల ప్రస్తావన రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. “మామూళ్లు మాయం.. పైసలు వేయండి.. పని కాదు” అంటూ సాగినట్లు చెబుతున్న సంభాషణలో డబ్బుల వ్యవహారమే ప్రధానంగా చర్చకు వచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం అనుమతులు పొందిన తర్వాత కూడా అదనపు చెల్లింపుల ప్రస్తావన ఎందుకు వచ్చిందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ వ్యవహారంలో మరింత ఆసక్తికరమైన అంశం ఇద్దరు పెద్దల పేర్లతో వినిపిస్తున్న వాటాల ప్రస్తావన. “ఇద్దరు పెద్దలకు ఇంత.. నాకు ఇంత?” అంటూ లెక్కలు మాట్లాడినట్లు ప్రచారంలోకి వచ్చిన మాటలు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఒకవేళ ఈ సంభాషణ నిజమైనదైతే, అసలు ఆ ఇద్దరు పెద్దలు ఎవరు? వారి పేర్లతో డబ్బుల లెక్కలు ఎందుకు ప్రస్తావనకు వచ్చాయి? వసూళ్ల వ్యవహారంలో వారికి సంబంధం ఉందా? లేక వారి పేర్లను అడ్డుపెట్టుకుని ఎవరైనా డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారా? అన్నది సమగ్ర విచారణలో తేలాల్సి ఉంది.
సంభాషణలో డబ్బుల విషయంలో బేరసారాలు జరిగినట్లు చెబుతున్న మాటలు వ్యవహారాన్ని మరింత వివాదాస్పదంగా మార్చాయి. “అంత కాదు.. కొంత ఇస్తాం” అనే తరహాలో డబ్బుల చర్చ సాగినట్లు సమాచారం. దీనికి స్పందనగా “అన్ని పర్మిషన్లు ఉన్నాయి కదా?” అని ప్రశ్నించగా.. “సరే.. మాట్లాడి చెబుతా” అంటూ సమాధానం ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్ని అనుమతులు ఉన్నప్పుడు అసలు ఈ డబ్బుల ప్రస్తావన ఎందుకు వచ్చింది? అనుమతులకు అదనంగా ఏం కావాలి? అధికారిక రుసుములేనా.. లేక అనధికారిక వసూళ్లా? అన్న ప్రశ్నలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి.
ప్రజలు తమ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ, నిబంధనల ప్రకారం ఫీజులు చెల్లిస్తూ అనుమతులు పొందుతుంటారు. అలాంటిది అనుమతులు ఉన్నప్పటికీ అదనపు చెల్లింపుల ప్రస్తావన వస్తోందన్న ఆరోపణలు మున్సిపల్ పాలనపై అనుమానాలు కలిగిస్తున్నాయి. ఇలాంటి వ్యవహారాలు నిజమైతే సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడటమే కాకుండా ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి రూపాయికి అధికారిక లెక్క ఉండాల్సిందే తప్ప, వ్యక్తిగత బేరసారాలకు అవకాశం ఉండకూడదు.
నూతనకల్ వార్డు అధికారికి సంబంధించినదిగా ప్రచారంలో ఉన్న ఈ సంభాషణపై మున్సిపల్ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. సంభాషణలో వినిపించిన మాటల వెనుక అసలు వాస్తవాలేమిటి? డబ్బుల డిమాండ్ జరిగిందా? ఇద్దరు పెద్దల పేర్లు ప్రస్తావించడానికి కారణమేంటి? ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారా? అన్న అంశాలపై విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలి. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Also read: సిద్దిపేట నీ జాగీరా హరీష్ రావు?.. బరాబర్ వస్తాం, అడ్డుకో చూస్తాం – భవానీ రెడ్డి సవాల్