Yellampet Municipality: స్వేచ్చ బ్యూరో: ఓ వైపు దేవీ నవరాత్రి ఉత్సవాలు.. మరోవైపు పోచమ్మ గుడి పక్కనే చెత్తకుప్పలు.. ఇంకోవైపు పొంగిపొర్లుతున్న డ్రైనేజీ! ఇదీ ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని డబల్‌పూర్ గ్రామం 23వ వార్డులో నెలకొన్న దుస్థితి. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన సమయంలో చెత్త, మురుగునీటితో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగ వేళ భక్తులు ఆలయానికి వస్తుంటే.. పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త, పొంగిపొర్లుతున్న డ్రైనేజీ కారణంగా తీవ్ర అసౌకర్యం కలుగుతోందని గ్రామస్థులు చెబుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు కనీస శ్రద్ధ చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవీ నవరాత్రుల సమయంలోనైనా ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచలేరా? అని ప్రశ్నిస్తున్నారు.
23వ వార్డులో పారిశుద్ధ్య సమస్యలు స్థానికులను వేధిస్తున్నా సంబంధిత అధికారులు స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. డంపింగ్ యార్డ్ సమస్యతోపాటు పొంగిపొర్లుతున్న డ్రైనేజీని కూడా తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సంబంధిత కౌన్సిలర్ సందర్శించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మున్సిపల్ చైర్మన్, కమిషనర్ తక్షణమే స్పందించి పారిశుద్ధ్య సిబ్బందిని పంపించాలని గ్రామస్థులు కోరుతున్నారు. పోచమ్మ గుడి పరిసరాల్లో చెత్తను తొలగించి, పొంగిపొర్లుతున్న డ్రైనేజీకి మరమ్మతులు చేపట్టి మురుగునీటి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.
Also read: గద్వాల మున్సిపల్ ఆఫీస్‌లో ఉద్రిక్తత.. కమిషనర్ విధులకు ఆటంకం!