Parishad Elections: స్వేచ్ఛ బ్యూరో: జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం కావడంతో రాజకీయ పార్టీల్లో పరిషత్ సందడి మొదలైంది. ఈ ఎన్నికలో గత సంవత్సరం సెప్టెంబర్ లో జరుగుతాయని భావించినా రిజర్వేషన్ల కేటాయింపుపై కోర్టు కేసుల్లో కారణంగా వాయిదా పడ్డాయి. దీంతో గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలతో ఆశావాహులు పదవులు పొందారు.తాజాగా ఎంపీపీ, జడ్పీ చైర్మన్ పదవులపై కన్నేసిన మరికొందరు నేతలు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఇటీవల ఓటర్ల ముసాయిదా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో ఎంపీటీసీ, జడ్పిటిసి ఆశావాహుల్లో సందడి మొదలైంది.
జిల్లాలో 13 మండలాలు ఉండగా 13 జడ్పిటిసి లకు ఎన్నికలు జరగనున్నాయి. గతంలో రిజర్వేషన్ల ప్రక్రియలో అధికంగా బీసీలకు కేటాయించడంతో జనరల్ స్థానాలు తగ్గాయి.అయితే రిజర్వేషన్ల మార్పుల్లో బీసీ రిజర్వుడు సీట్లు తగ్గించి 50% లోపు రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉండేలా నిర్ణయం తీసుకోనుండడంతో రిజర్వేషన్లలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే ఈసారి జడ్పీ లపై జెండా ఎగరవేయాలని అధికార కాంగ్రెస్,బిఆర్ఎస్ ,బిజెపి పార్టీలు పావులు కదుపుతున్నాయి. మండలాల వారిగా తనకు కలిసి వచ్చే స్థానాలపై ఆశావాహులు పార్టీలు ఓటర్ల మొగ్గు తదితర అంశాలపై కసరత్తును ప్రారంభించారు.
Also Read: తెలంగాణ నిరుద్యోగులకు మే నెలలో తీపి కబురు..?
ఎన్నికల సన్నాహక ప్రక్రియ ప్రారంభించడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెలలో పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అధికార యంత్రంగాన్ని సన్నద్ధం చేస్తున్నారు.ఇప్పటికే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ప్రభుత్వం పరిషత్ ఎన్నికలకు పచ్చ జెండా ఊపింది.రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రక్రియ పూర్తయితే వచ్చే నెలలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 2025 జూలై 10 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 5 వరకు కేంద్ర ఎన్నికల సంఘం నవీకరించిన జాబితాను ప్రామాణికంగా తీసుకోవాలని కలెక్టర్లకు జారీచేసిన ఆదేశాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
ఆ జాబితాలో నియోజకవర్గాల్లోని అదనపు ఓటర్ల వివరాలను, మండలాల వారిగా గుర్తించి వాటిని సంబంధిత పంచాయతీ పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న జాబితాలకు జత చేయాలని ఆదేశించింది.వీటి ఆధారంగానే ఎంపిటిసి, జడ్పిటిసిల పరిధిలోని జాబితాలను జిల్లా పంచాయతీ అధికారి ధ్రువీకరించిన అనంతరం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ యూజర్ మాన్యువల్ సూచనల ప్రకారం పోలింగ్ సెంటర్లకు అనుసంధించాలని పేర్కొంది. అందుకు అనుగుణంగా ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధం చేసి ప్రచురించేందుకు వీలుగా జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు. అభ్యంతరాలు,సలహాలు,సూచనలు పరిగణనకు తీసుకొని తుది జాబితాన్ని విడుదల చేసి, ఆ తర్వాత పోలింగ్ సెంటర్లు, బ్యాలెట్ బాక్స్ లు ఇతర ఏర్పాట్లు చేయనున్నారు.
Also Read: ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌కు రేవంత్ పునాది… పోలీస్ అధికారులనే వెంటాడుతామనే అహం హరీశ్‌ది!